చంద్ర‌బాబుకు అక్క‌డ చుక్క‌లే

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అపార రాజ‌కీయ‌ అనుభ‌వ‌మున్న నేత ఎవ‌రంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్ర‌బాబు! రాజ‌కీయ వ్యూహాలు ర‌చించి ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేయ‌డంలో అయ‌న‌కు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయ‌న‌కే ఒక జిల్లాలో రాజ‌కీయాలు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. ఆ జిల్లాలో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్నాయ‌ట‌. ముఖ్యంగా సొంత‌ పార్టీలోని వ‌ర్గ రాజ‌కీయాలే ఇందుకు కార‌ణ‌మని ప‌రిస్థితులు తేట‌తెల్లం చేస్తున్నాయి. స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగినా ప‌రిస్థితి మార‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు! ఇంత‌కీ ఆ జిల్లా ఏంటో గుర్తొచ్చే ఉంటుంది క‌దా! మీరు ఊహించింది నిజ‌మే ఆ జిల్లా క‌డ‌ప‌!!

సీఎంగా అధికారం చేప‌ట్టిన నాటినుంచి విప‌క్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లాపై చంద్ర‌బాబు, లోకేశ్‌ ప్ర‌త్యేక దృష్టి సారించారు. తొలినుంచీ వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన ఆ జిల్లాలో ఎలాగైనా పాగా వేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావును ఇన్‌చార్జిగా నియ‌మించారు. అయితే సీమ మార్క్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన క‌డ‌ప‌లో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ్యూహాలు ఫలిచ‌డం లేద‌ట‌. ఇందుకు టీడీపీ నేతలే కార‌ణ‌మ‌ట‌. అందులోనూ గ్రూపు, వర్గపోరుతో ఢీ అంటే ఢీ అంటున్నార‌ట‌! ఈ వ‌ర్గ పోరు ఎంత‌లా అంటే ఒక వ‌ర్గం నిర్వ‌హిస్తున్న‌ స‌మావేశాల‌కు మ‌రో వ‌ర్గం వారిని పిల‌వ‌లేనంత‌గా.. గ్రూపు రాజ‌కీయాలు ముదిరిపోయాయ‌ట‌.

జిల్లా సమ‌న్వ‌య స‌మావేశాలు.. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదిక‌లు అయిపోయాయి! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్వయంగా కడపలో పార్టీ సమావేశం పెడితే.. అక్కడ కూడా రగడ సృష్టించారు. జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముప్పైకి పైగా గ్రూపులున్నట్టు అంచనా. ఈ గ్రూపుల మధ్య సమన్వయం సాధించడానికి ఇన్‌ఛార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రయత్నిస్తున్నా అస్స‌లు మార్పు రాలేదట. దీంతో ఇన్‌చార్జి బాధ్య‌త వ‌ద్ద‌ని గంటా మొర‌పెట్టుకుంటున్నార‌ట‌. మ‌రి వీటిని చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు ఎలాంటా వ్యూహం ర‌చిస్తారో మ‌రి!!