ప‌వ‌న్‌తో బీజేపీ రాజీ యత్నాలు

హోదా ప్ర‌క‌టించనందుకు ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో దూర‌మవుతున్న‌ మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. ముఖ్యంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తీవ్ర స్వ‌రంతో బీజేపీపై విరుచుకుప‌డుతున్నాడు. ద‌శ‌ల వారీ పోరాటానికి కార్యాచ‌ర‌ణ కూడా ప్ర‌క‌టించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భ‌విష్య‌త్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే ప‌వ‌న్‌ రంగంలోకి దిగ‌కుండా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జ‌న‌సేనానితో రాయ‌బారానికి దిగారు.

`కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ పొట్ట‌లో పొడించింది` అంటూ ఏపీకి చేసిన అన్యాయంపై కాకినాడ వేదిక‌గా జ‌రిగిన స‌భ‌లో ప‌వ‌న్బీ.. జేపీపై విరుచుకుపడ్డాడు! ఏపీకి హోదా ఇస్తామ‌ని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పి.. ఇప్పుడు పాచిపోయిన రెండు ల‌డ్డూలు చేతిలో పెట్టారని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టాడు. రాష్ట్ర విభ‌జన అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు ప‌వ‌న్‌! మోదీ హ‌వా ఉన్నా.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప‌వ‌న్ బ‌లం కూడా అభ్య‌ర్థుల‌ విజ‌యంపై ప్ర‌భావం చూపింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్‌.. బీజేపీపై స‌మ‌ర‌శంఖం పూరించ‌డంతో అయోమ‌య‌స్థితిలో ప‌డిపోయారు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు!

హోదా కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన టీడీపీ.. ప్యాకేజీతో స‌ర్దుకుపోయింది. ఇక మిగిలింది పవ‌న్ క‌ల్యాణే!! ప‌వ‌న్ పోరాటాన్ని ఆదిలోనే నిలిపివేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేంద్రం ప్ర‌క‌టించిన‌ ప్యాకేజీతో వ‌చ్చే లాభాలు స‌మ‌గ్రంగా వివరిస్తే, ప‌వ‌న్ అర్థం చేసుకుంటార‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చెబుతున్నారు. భ‌విష్య‌త్తులో ప‌వ‌న్‌పై బీజేపీ నేత‌లెవ‌రూ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టొద్ద‌ని అధిష్ఠాన పెద్ద‌లు సూచించారు.

ప్రస్తుతం బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని నేత‌లు గుర్తించారు. ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డం వ‌ల్ల అది పార్టీకి న‌ష్టంచేకూరుస్తుంద‌ని, ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆదేశాలిచ్చారు. ఒక‌వేళ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ దూర‌మైనా.. ప‌వ‌న్ అండతోనైనా ఏపీలో నెగ్గుకురావ‌చ్చ‌న్న‌ది బీజేపీ వ్యూహంలా క‌నిపిస్తోంది. అందుకే ప‌వ‌న్‌ను బుజ్జ‌గించి త‌మ దారికి తెచ్చుకునేందుకు రాయ‌బారాలు చేస్తోంది!!