టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ

మిత్రధ‌ర్మాన్ని బీజేపీ ప‌క్క‌న పెట్ట‌బోతోందా? ఇక సొంతంగా తెలంగాణ‌లో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా?  విమోచ‌న దినాన్ని బీజేపీ అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌డం వెనుక అస‌లు వ్యూహం ఏమిటి?  టీడీపీ, కాంగ్రెస్‌లు ఢీలా ప‌డిపోయిన స‌మ‌యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ఆ పార్టీకి ఎంత వ‌ర‌కూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే స‌మ‌యంలో టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ ప‌డిందా?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు అందరిలోనూ మెదులుతున్నాయి!
తెలంగాణ‌లో ప్ర‌ధాని మోడీ తొలి ప‌ర్య‌ట‌న సూప‌ర్ హిట్ అయింది. వేదిక‌పై ప్ర‌ధాని మోడీ, సీఎం కేసీఆర్ ఒక‌రినొక‌రు తెగ పొగిడేసుకున్నారు. ఇక గులాబీ ద‌ళంతో క‌మ‌ళం దోస్తీ క‌ట్ట‌డం.. ఇక టీడీపీకి బైబై చెప్ప‌డం ఖాయ‌మ‌నుకున్నారు విశ్లేష‌కులు! కానీ అది జరిగి స‌రిగ్గా రెండు నెల‌లైనా కాక‌ముందే బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా.. టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు మజ్లిస్ అంటే భ‌య‌మ‌ని దుయ్య‌బట్టారు. కేంద్ర‌ప‌థ‌కాలు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా కేసీఆర్‌, అండ్ కో అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. అయితే అమిత్ షా ఇంత‌లా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి కార‌ణాలేంట‌ని ఆలోచిస్తే.. దీని వెనుక భారీ వ్యూహ‌మే ఉంద‌ట‌.
2014 ఎన్నిక‌ల్లో టీడీపీతో దోస్తీ క‌ట్ట‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం వాటిల్లింద‌ని తెలంగాణ నేత‌లు భావిస్తున్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో టీడీపీ బుక్క‌యిపోవ‌డం, అలాగే అధ్య‌క్షుడు ర‌మణ‌, రేవంత్ రెడ్డి మ‌ధ్య విభేదాలు కూడా బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును త‌గ్గించేస్తున్నాయ‌ని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా అప్పుడ‌ప్పుడూ పోరాడుతున్నా.. దానికి కూడా స‌రైన మైలేజ్ రావ‌డం లేదు. అందుకే టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.
`మ‌న‌కంటూ బ‌లం పుంజుకోవాల్సిన స‌మ‌య‌మిదేన‌`ని బీజేపీ భావిస్తోంది. మిత్రుని మించిన బ‌లం కూడ‌గ‌ట్టుకోవాలంటే ఇంత‌కంటే మంచి స‌మ‌యం దొర‌క‌దని భావించి, స‌రైన స‌మ‌యంలో అమిత్ షాని రంగంలోకి దించింది. తెలుగుదేశం స్త‌బ్దుగా ఉంటున్న ఈ స‌మయాన్ని స‌ద్వినియోగం చేసుకుంటే.. త‌మ పార్టీ శ్రేణులను బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తో ఉంది. దీంతో టీడీపీ ఓటుబ్యాంకును కొల్ల‌గొట్టాల‌ని వ్యూహం ప‌న్నుతోంది.