పవన్‌తో పోటీ ఎందుకు రోజా!

పవన్‌ ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. వస్తానంటున్నాడంతే. అలాంటి పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శిస్తే రోజాకి ఒనగూరే లాభమేంటట? రాజకీయాల్లో చిరంజీవి అంటే రోజాకి అస్సలు పడదు. టిడిపిలో ఉండగానే కాదు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా రోజా, ఇంకా గట్టిగా చిరంజీవిని విమర్శిస్తూ వచ్చారు. చిరంజీవితోపాటు పవన్‌కళ్యాణ్‌ని కూడా విమర్శించడం ఆమెకు అలవాటు.

టిడిపి గెలిచిందే పవన్‌కళ్యాణ్‌ దయతో అని చెబుతూనే పవన్‌కళ్యాణ్‌ని రబ్బర్‌సింగ్‌ అని తీసిపారెయ్యడం రోజాకే చెల్లింది. రబ్బర్‌సింగో, గబ్బర్‌సింగో రోజాకే బాగా తెలుసు. ఓ బహిరంగ సభని రోజా పెడితే వచ్చే జనానికీ, పవన్‌కళ్యాణ్‌ పిలిస్తే వచ్చే జనానికీ తేడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే గనుక స్థాయి విషయంలో రోజా ఓ మెట్టు ఎక్కువ. కాబట్టి, ఆమె తన స్థాయిని తగ్గించుకునేలా వ్యవహరించడం తగదు.

ప్రత్యేక హోదా కోసం పవన్‌ నినదించారు. చేతనైతే రోజా, పవన్‌కళ్యాణ్‌కి మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉద్యమించేలా చేయగలగాలి. అది మానేసి పవన్‌కళ్యాణ్‌ని విమర్శించడమంటే, ప్రత్యేక హోదా ఉద్యమానికే వెన్నుపోటు పొడిచినట్లవుతుంది. చిరంజీవినీ, పవన్‌కళ్యాణ్‌నీ విమర్శిస్తేనే తనకు మీడియాలో చోటు దక్కుతుందని ఎన్నాళ్ళు రోజా తన స్థాయిని తగ్గించుకుని వ్యవహరిస్తారట?