ఎడ్యుకేట్‌ చేస్తున్న వెంకయ్య.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి చూస్తారు. చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలని, ఎందరో రాజకీయ నాయకుల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని చూసి, సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం ఓటుతో చెప్పారు ప్రజలు.

ఎన్నికలకు ముందేమో హోదా అంటారా? ఎన్నికలయ్యాక హోదా కాదు, ప్రత్యేక సాయం చేస్తామని చెబుతూ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఎడ్యుకేట్‌ చేస్తామంటారా? ప్రజలు మీలాంటి రాజకీయ నాయకుల్ని ఎందుకు విశ్వసించాలట? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వెంకయ్యనాయుడు చెప్పే ప్యాకేజీ మాటలే నిజమైతే, ఆ ప్యాకేజీ నినాదంతో ఒక్క ఎంపీ రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్ళగలగాలి. అప్పుడు ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో తెలుస్తుంది. కానీ అంతటి సాహసం భారతీయ జనతా పార్టీగానీ, తెలుగుదేశం పార్టీగానీ చేయలేదు. ఇప్పుడే అర్థమవుతోంది అందరికీ, ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంలో కాంగ్రెసుతోపాటు బిజెపి – టిడిపిలకు కూడా భాగం ఉందని.