‘శాతకర్ణి’ వాట్‌ ఏ ప్లానింగ్‌.

కొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా సులువు. ఇంకొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా కష్టం. చారిత్రక ఘట్టాల్ని సినిమాగా తెరకెక్కించాలంటే ఎంతో నేర్పు కావాలి. ఎక్కువ కాలం సినిమా నిర్మిస్తామంటే ఖర్చులు పెరిగిపోతాయి. పరిస్థితులు కూడా ఒక్కోసారి అనుకూలించవు. కానీ తప్పదు, కొన్ని సినిమాలకు సమయం పడుతుంది. అయితే సరైన ప్లానింగ్‌ ఉంటే కొంతవరకు సమయం తగ్గించుకోవచ్చు. దర్శకుడు క్రిష్‌, ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం, నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించడం, తక్కువ టైమ్‌లో సినిమాని లావిష్‌గా తెరకెక్కించడంలో దిట్ట.

‘కంచె’ సినిమా అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న విధంగా రూపొందిందంటే అది క్రిష్‌ వల్లనే సాధ్యమయ్యింది. ఇంకెవరైనా అయితే బడ్జెట్‌ హద్దులు దాటేది. అలాంటి క్రిష్‌ రూపొందిస్తున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా 80 శాతం షూటింగ్‌ పూర్తయ్యిందంటే నమ్మగలమా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు క్రిష్‌. బాలకృష్ణ 100వ సినిమా ఇది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. మిగతా 20 శాతం షూటింగ్‌తోపాటు సైమల్టేనియస్‌గా గ్రాఫిక్స్‌ వంటి పనులను పూర్తి చేయనున్నారు. శ్రియ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.