ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని అనుకోలేదు. దాంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏపికి ప్రత్యేకహోదా కల్లే అన్న విషయం తేలిపోయింది.

పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించటానికి తాను ప్రధానిని కలిసినట్లు సిఎం మీడియాతో చెప్పుకున్నారు. పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరాన్ని, ఇవ్వకపోతే జరగబోయే నష్టాన్ని కూడా తాను ప్రధానికి వివరించినట్లు స్వయంగా చంద్రబాబే మీడియాతో చెప్పారు. 20 నిముషాల పాటు తామిద్దరమూ సమావేశమైనట్లు చెప్పారు. ఆ తర్వాత పార్టీ ఎంపిలు కూడా ప్రధానితో 10 నిముషాల పాటు భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీలో కానీ లేక ఆ తర్వాత ఎంపిలతో సమావేశ మైనపుడు గానీ ప్రత్యేకహోదా అంశంపై ప్రధానమంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదని తేలిపోయింది. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రానట్లే అని ప్రజానీకం నిర్ణయానికి వచ్చేసారు.

ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవన్న విషయాన్ని పలువురు కేంద్రమంత్రులు గతంలోనే పలుమార్లు, వివిధ వేదికల నుండి ప్రకటించారు కూడా. అయితే, కేంద్రమంత్రులు ప్రకటించినపుడుల్లా ఇటు ముఖ్యమంత్రి గానీ అటు టిడిపి తరపున కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు కూడా భాజపా మంత్రుల ప్రకటనలకు భిన్నమైన ప్రక టనలు చేస్తూ వచ్చారు. దానికితోడు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి ఒక్కోసారి ఒక్కో విధంగా అభిప్రాయాలు చెబుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో పూర్తి అయోమయం నెలకొంది. దాంతో విపక్షాలు పలుమార్లు ఆందోళనలు చేసింది. దానికితోడు విభజన హామీల అమలు విషయంలో గానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గానీ కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదేసమయంలో ప్రత్యేకహోదా డిమాండ్‌తో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు ప్రజల నుండి మంచి స్పందనే వస్తున్నది. కాబట్టి ప్రత్యేకహోదా సాధన అన్నది ఒక సెంటిమెంట్‌గా ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయింది.

ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటుమెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక, అప్పటి నుండి రాజ్యసభలో మిత్రపక్షాలైన టిడిపి, భాజపాలు వేసిన పిల్లిమొగ్గలను అందరూ గ మనిస్తూనే ఉన్నారు. ప్రైవేటుమెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన కెవిపి చాప క్రింద నీరులా జాతీయ పార్టీల మద్దతును కూడాగట్టారు. దాంతో రాజ్యసభలో బిల్లుపై చర్చ మొదలైనపుడు సభలో బీజేపీ ఏకాకిగా మిగిలిపోయింది. దాంతో కమలనాధులు ఖంగుతిన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి ప్రత్యేకహోదా ఇవ్వటం ఇష్టం లేదన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. దానికితోడు రాజ్యసభలో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భాజపా అహం దెబ్బతిన్నది. ప్రధానితో ఇటు ముఖ్యమంత్రి కలిసినా అటు టిడిపి ఎంపిలు సమావేశమైనా నరేంద్రమోడి నుండి మాత్రం ఎటువంటి హామీని రాబట్టుకోలేకపోయారు. భాజపా వైఖరి తెలిసిపోయిన నేపధ్యంలో ఇక తేలాల్సింది రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ వైఖరి మాత్రమే.