టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచే మిషన్‌ భగీరథ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అయితే ప్ర‌ధాన‌మంత్రి  తెలంగాణ‌ రాష్ట్ర పర్యటనపై బీజేపీ వర్గాల్లో గుబులు వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో రాష్ట్రంలో పాలనను మోడీ ఎక్కడ ఆకాశానికెత్తి ప్రసంసిస్తారో అనే సందేహం బీజేపీ నేతల్లో నెలకొంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ సంకటంలో ఉన్నాయని, బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందంటూ ఇక్కడి నేతలు ఢంకా బజాయించుకుంటున్నారు.ఓవైపు అదే మెద‌క్‌ జిల్లాలో మల్లన్నసాగర్‌ మంటలు రాజుకుంటున్నాయి. రైతుల పక్షాన ఉన్నామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపైనే కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రధాన ప్రతిపక్షాలతో రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలు వేదికలు పంచుకుంటున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదలు అన్నింటా రాష్ట్ర సర్కార్‌ వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతున్నారంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పుడు మోడీ పర్యటన తమకు ఎలాంటి అనుభవాలు మిగులుస్తుందోననే మీమాంస రాష్ట్ర బీజేపీ నేతల్ని వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర పర్యటనలకు వస్తున్న కేంద్ర మంత్రులందరూ ఇక్కడి ప్రభుత్వ పనితీరును ‘శెభాష్‌’ అని ప్రసంసించి వెళ్తున్నారు. ఇటీవల జరిగిన విస్త్రత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రుల వ్యాఖ్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మల్చుకొని, ప్రచారం చేసుకుంటూ, ఇక్కడి పార్టీ నేతల్ని చులకన చేసి మాట్లాడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈమేరకు రాష్ట్ర పథాధికారుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపారు.

ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రే రాష్ట్రసర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తే, తమ పరిస్థితి ఏంటనేది అంతుచిక్కట్లేదు.మోడీ పర్యటనలో భాగంగా ఆదేరోజు సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం ఉంది. ఇక్కడ గంటసేపు మోడీ ప్రసంగం ఉండబోతోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపై ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రసంగం ప్రభుత్వ కార్యక్రమంలో దానికి భిన్నంగా ఉంటుందా లేక అదే తరహాలో కొనసాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రాష్ట్రానికి ప్రధానమంత్రి రావాలని తొలుత ఆహ్వానించింది రాష్ట్ర బీజేపీ నేతలే. ఆ తర్వాతే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోడీని రమ్మని ఆహ్వానించారు. పార్టీ పరంగానే ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఉంటే బాగుండేదని, ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం సరికాదని కొందరు బీజేపీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పార్టీకి నష్టమే కాని ఎలాంటి మేలూ జరుగదని విశ్లేషిస్తున్నారు. ఆదే సందర్భంలో ప్రధాని నోటివెంట తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను వెల్లడించేలా ఆయన ప్రసంగ పాఠాన్ని రూపొందించాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. గతంలో ఇదే విషయంపై ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. మొత్తంగా త‌మ ర‌థ‌సార‌థి ప‌ర్యట‌న ఇపుడు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టింది.