జగన్ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు!!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్‌’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా, ఆ ఆస్తులతో ప్రభుత్వ ఖజానాని పెంచుకోవడం, అలాగే అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నామనే సంకేతాలు పంపడం, వీటితోపాటుగా ప్రతిపక్ష నేతను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం అనే అకోణాల్లో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందని అర్థం చేసుకోవాలి. అటాచ్‌మెంట్‌కి గురైన వాటిల్లో వైఎస్‌ జగన్‌కి చెందిన మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్నట్లయితే తమకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఒక్కటీ ఉండదని బహుశా చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేస్తుండొచ్చు. కానీ ఇదంతా జరిగే పనేనా? రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇది కక్ష సాధింపు చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.