ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. నెల్లూరు జిల్లాలోని 8 జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించక పోవడం బీసీ సామాజిక వర్గాలను నిరాశ పరిచింది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కావాలి నియోజకవర్గం నుంచి బీద మస్తాన్‌రావుకు అవకాశం లభించింది. 2014లో ఇరు పార్టీలు ఒక్కో స్థానాన్ని బీసీలకు కేటాయించింది. టీడీపీ తరఫున బీద మస్తాన్‌రావుకు, వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం లభించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు ఓడిపోయారు. మస్తాన్‌రావు ఓడిపోవడంతో… నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి నారాయణను వరించింది.
2019 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి బీద మస్తాన్‌రావును నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ బరిలో నిలిపింది. వైసీపీ తరఫున నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత… ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో మొదటి సారి బీసీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను మంత్రి పదవి వరించింది. 2024 ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే ఏలూరు, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపీ టీడీపీ కూడా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా బీసీలను రంగంలోకి దింపాలని ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. వీరిలో బీద రవిచంద్రయాదవ్, పొన్నుబోయిన చంచల్‌బాబు, డా. మస్తాన్ యాదవ్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తే గెలుస్తారనే అంశంపై టీడీపీ అగ్రనేతలు పలు రకాల సర్వేలు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
చంద్రబాబు వ్యూహం ప్రకారం నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు ఇస్తే గెలుపు సునాయాసం అవుతున్నట్లు సమాచారం.