ప్రజాక్షేత్రంలోని నారా లోకేష్, భువనేశ్వరి… క్యాడర్‌ కోసమేనా…?

నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నారు. చంద్రబాబు లేకుండా జరుగుతున్న తొలి సమావేశంలో పార్టీ కీలక ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితోపాటు నారా లోకేష్ పర్యటనల షెడ్యూల్ ఖరారు కానున్నది. చంద్రబాబు అరెస్టుపై ఒకపక్క న్యాయ పోరాటం చేస్తూనే.. మరోపక్క ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన విధానంపై పార్టీ సమావేశం చర్చించనున్నది.

నిలిచిపోయిన ”బాబు షూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” అనే కార్యక్రమాన్ని చంద్రబాబును అరెస్టు చేసిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. లోకేష్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటన చేయాల్సిన మిగతా జిల్లాల్లో లోకేష్ టూర్ కొనసాగనుంది. దీంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే నినాదంతో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఇందులో భాగంగానే ఆమె పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, అనేకమంది జైలు నుంచి విడుదలైన వారిని ఆమె పరామర్శిస్తారని చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబుతో నేను అనే కార్యక్రమం ప్రస్తుతం అనేక నియోజకవర్గాలలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం నేటి వరకు ఎంతవరకు జరిగింది, ఎలా పూర్తి చేయాలనే అంశంపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు. స్కిల్ కేసు, ఎపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ కేసులకు సంబంధించి నిజానిజాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని రూపొందించి ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యకర్తలు, నేతలు పంపిణీ చేస్తున్నారు. అనేకమంది పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ… కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అందువల్లే వీరందరూ పాల్గొనే విధంగా పార్టీ కార్యక్రమాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఇక ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫామ్ 7తో టీడీపీ ఓట్లు తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా టీడీపీ నేతలకు శనివారం నాటి సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.