టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా?

రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేతల్లో సైతం ఐక్యతను నెలకొల్పిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ హామీల అమ‌లు బాధ్యత తనదే అని రాహుల్ భరోసా కల్పించడం పార్టీ వర్గాల్లో ఉత్తేజాన్ని నింపాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లో చేపట్టిన రాహుల్ యాత్ర పది నియోజవర్గాల మీదుగా కొనసాగింది. ఈ యాత్ర హస్తానికి అభయ హస్తంలా ఉపయోగపడింది.

రాహుల యాత్ర గులాబీ కంచుకోట‌కు నిలయమైన ఉత్తర తెలంగాణ‌ మీదుగా సాగింది. రానున్న ఎన్నికలు దొరల తెలంగాణ వ‌ర్సెస్ ప్రజ‌ల తెలంగాణ అని రాహుల్ గాంధీ ఇప్పటికే విస్పష్టం చేశారు. పాల‌న‌కు దూర‌మ‌య్యామ‌ని మథనపడుతున్న కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ తన ప్రసంగాలతో జోష్‌ నింపారు. రాబోయే ప్రభుత్వం మ‌న‌దే బ్రదరూ అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలు… బీఆర్ఎస్ ప‌రోక్ష మ‌ద్దతు వంటి అంశాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ జెండాను రాహుల్ రెపరెపలాడించారు.

మొదటి రోజు బస్సు యాత్ర ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాగింది. అక్కడ 12 నియోజకవర్గాలు ఉంటే అందులో ములుగు మినహా మిగతావన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. ఆ జిల్లాలోని నిరుద్యోగులు, మహిళల సమస్యతో పాటు, అధికార పార్టీ ఇసుక అక్రమ రవాణ తదితర అంశాలపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొనసాగిన బస్సు యాత్ర కూడా కాంగ్రెస్‌కు ఉపకరిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లో 13 అసెంబ్లీ స్థానాలు ఉంటే… మంథని మినహా మిగతా నియోజకవర్గాలకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా చోట్ల రాహుల్ చేసిన ప్రసంగాలు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచేందుకు దోహదపడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో సాగిన బస్సు యాత్ర మరో మైలురాయిగా నిలిచింది. చక్కెర కర్మాగారం తిరిగి ప్రారంభిస్తామని, పసుపు రైతులకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇవ్వడంతో ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో అన్ని సిట్టింగ్ స్థానాలు గులాబీ పార్టీవే. ఈ బస్సుయాత్రతో పార్టీ వీక్‌గా ఉన్న పది నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ రీచార్జ్ అయినట్టేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

బస్సు యాత్రలో కాంగ్రెస్ లక్ష్యం నెరవేరినట్టేనని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ టచ్ చేసేలా సమ్మక్క, సారక్క ప్రాంతం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టడం… రామప్ప ఆలయంలో పూజలు చేయడంతోపాటు సింగ‌రేణి కార్మికులు, రైతులు, యువ‌త‌తో చ‌ర్చించ‌డం కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు. తరువాత పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం, రోడ్డుపై హోటల్‌లో దోశలు వేసి తినడం, చిన్న హోట‌ల్‌లో టీ తాగ‌డం ద్వారా రాహుల్ బ‌ల‌మైన సందేశాన్ని ప్రజ‌ల‌కు పంపారు. సామాన్య ప్రజ‌లకు కాంగ్రెస్ ద‌గ్గర‌గా ఉంటుంద‌ని రాహుల్ గాంధీ తన హావభావాల ద్వారా వివరించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండ‌ర‌నే విమర్శలున్న నేప‌థ్యంలో.. కాంగ్రెస్‌ సామాన్యుల హస్తమని రాహుల్ తన పర్యటన ద్వారా రుజువు చేశారు.

మూడు రోజుల యాత్రలో రాహుల్ తన అజెండాను ప్రజలకు స్పష్టంగా చేరవేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ ఒక్కటేనని ప్రజలకు వివరించడంలో సక్సెస్‌ అయ్యారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం, తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని రాహుల్ పదేపదే గుర్తు చేశారు. మరోవైపు చేరికలు… కోదండరాంతో జరిపిన చర్చలు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలని హస్తం నేతలు సంబరపడుతున్నారు.