నవంబర్ వరకు జైలులోనే నివాసం… నిజమేనా…?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే ఆయన నవంబర్‌ నెలలో బయటకు వస్తారని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చంద్రబాబు కేసులకు వర్తిస్తుందని, అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసులు చెల్లవని వేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పును నవంబర్‌లో ధర్మాసనం వెలువరిస్తుందని భావిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అంతా చంద్రబాబు విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్‌పై విచారణ త్వరితగా పూర్తి కావడం లేదు. ఇప్పటికే స్కిల్ కేసులో 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై… ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ ఏడుకు వాయిదా పడింది. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్ విచారణను నవంబర్ తొమ్మిది నాటికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఫైబర్ నెట్, ఐఆర్ఆర్… ఎలైన్ మెంట్ కేసు విచారణలతోపాటు పీటీ వారెంట్‌ల విచారణ కూడా వాయిదా పడ్డాయి. క్వాష్ పిటీషన్‌పై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది.

సుప్రీం కోర్టుకు శనివారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు దసరా సెలవులు. 30వ తేదీ తరువాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు భావిస్తే జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. తీర్పు అనుకూలంగా రాకపోతే అన్ని కేసులకు మళ్లీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని.. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్‌ నెట్‌ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని స్పష్టం చేసింది.

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తదుపరి విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేసింది.