బాబు ఆరోగ్యం, వయసు… అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

నారా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే మాట పని రాక్షసుడు అంటారు. రోజుకు 16 గంటలు పని చేస్తాడని…. ఆయన నవ యువకుడని కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా ఆయన అరెస్టు తర్వాత అదే టీడీపీ నేతలు చెబుతున్న మాటలు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీకే బూమ్‌ రాంగ్‌గా మారుతున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు పైన సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసేవారు. గంటల గంటల పాటు రివ్యూలు నిర్వహించి విసిగిస్తారని… అర్థరాత్రి పూట సభలు పెట్టి గంటల కొద్ది ఊకదంపుడు ప్రసంగాలతో… చెప్పిందే చెప్పి… ప్రజల సహనాన్ని పరీక్షించే వారని పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. కొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి… మా నేత రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తాడు… మరీ మీ లీడర్ అలా చేయగలడా అని ఇతర పార్టీల నేతలకు సవాల్ కూడా విసిరారు. చివరికి 73 ఏళ్ల నవ యువకుడు అంటూ గొప్పలు కూడా చెప్పుకున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు ప్రసంగాలు కూడా… తొడలు కొట్టడం… సవాళ్లు విసిరడం వంటివి చేస్తూ అభిమానులను ఉత్తేజ పరిచారు.

ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో స్కామ్ చేశారంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే 36 రోజులుగా బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై అదే టీడీపీ నేతలు చెబుతున్న మాటలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే… అవే మాటలు సోషల్ మీడియాలో తెగ నవ్వు తెప్పిస్తున్నాయి కూడా. నిన్నటి వరకు చంద్రబాబును నవ యువకుడు అని గొప్పలు చెప్పిన నేతలే… ఇప్పుడు మాత్రం 73 ఏళ్ల వృద్ధుడు అని చెబుతున్నారు. ఈ వయస్సులో పెద్దాయనను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇక ఇంకో విషయం ఏమిటంటే… సంపూర్ణ ఆరోగ్యవంతుడు… అంటూ చెప్పుకొచ్చిన పార్టీ నేతలే.. ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 5 కేజీలు బరువు తగ్గాడని… మరో రెండు కేజీలు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే ఆయనకు చర్మ సంబంధ వ్యాధి ఉందని కూడా చెబుతున్నారు. జైలులో ఉన్న చంద్రబాబుకు నిత్యం ఇంటి భోజనమే వెళ్తుంది. ఇంకోవైపు జైలులో ఉన్న చంద్రబాబు… ఏటూ కదలటం లేదు. అంటే… ఆయనకు శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కూడా లేదు. పార్టీ నేతలతో రివ్యూలు లేవు. కేవలం జైలు నుంచి బయటకు ఎలా రావాలి… కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే… బరువు పెరుగుతారు తప్ప.. తగ్గే అవకాశమే లేదు అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నిన్నటి వరకు నవ యువకుడు అయిన చంద్రబాబు.. ఇప్పుడు అరెస్ట్ అయిన వెంటనే వృద్ధుడు ఎలా అయ్యాడని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.