రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ నుంచే పోటీ చేస్తారా….!?

చంద్రబాబు అంటే… అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే నియోజకవర్గం కుప్పం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఇప్పటికే వరుసగా 7 సార్లు విజయం సాధించారు. 1989లో తొలిసారి కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు… నాటి నుంచి వరుసగా 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే… 1999 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో కాలు కూడా పెట్టడం లేదు. సిట్టింగ్ జడ్జి ఎదురుగా నామినేషన్ డిక్లరేషన్ ఇస్తారు. ప్రచారం చేయరు. ఇక ఓటు కూడా హైదరాబాద్ లేదా విజయవాడలో మాత్రమే వేస్తున్నారు తప్ప… కుప్పంలో మాత్రం ఆయనకు ఓటు హక్కు లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత కూల్ గా వెళ్లి ర్యాలీ చేస్తారు. ఒక రకంగా చూస్తే… ఇదో రికార్డు కూడా. వరుసగా 5 సార్లు దేశంలో ఏ నేత కూడా ఈ విధంగా వ్యవహరించలేదు… గెలవలేదు. ఇంక చెప్పాలంటే… చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేదు. నారా వారి పల్లె ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉంది. కుప్పం పర్యటకు వెళ్లే సమయంలో ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు తప్ప… ఇల్లు లేదు. ఇదే అంశంపై అధికార పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో… ఇప్పుడు కుప్పంలో ఇల్లు కడుతున్నారు.

అయితే కుప్పంలో చంద్రబాబు గెలుపునకు ప్రధాన కారణం దొంగ ఓట్లు అనేది వైసీపీ నేతలు తొలి నుంచి చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందుకే కుప్పంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించడంతో టీడీపీ ఓడిపోయింది. ఇది చంద్రబాబుకు ఊహించని ఎదురుదెబ్బ. దీంతో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తే ఓడిపోతామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుప్పం బదులుగా ఈ సారి రాయలసీమలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగైదు నియోజకవర్గాలను పరిశీలించిన టీడీపీ నేతలు… ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నంద్యాలలో చంద్రబాబు సొంత సామాజికవర్గం ఓట్లు చాలా తక్కువ. పైగా అక్కడ ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి పెద్దగా చేసిందేమి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు కూడా. దీంతో నంద్యాలలో చంద్రబాబు పోటీ చేయడం అంటే… కోరి కొరివితో తలగొక్కున్నట్లే అవుతుంది అనే మాట వినిపిస్తోంది.