అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు అనేది టి‌డి‌పికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు.

అందుకే చంద్రబాబు..బి‌జే‌పితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బి‌జే‌పి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు జనసేన సైతం తగ్గేదెలే అన్నట్లు ఉంది. ఇటు బి‌జే‌పి ఏమో ఎంపీ సీట్ల విషయంలో, అటు జనసేన ఏమో ఎమ్మెల్యేల సీట్ల విషయంలో డిమాండ్ ఎక్కువ చేస్తుంది. బి‌జే‌పి దాదాపు 8 ఎంపీ సీట్ల వరకు అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. కుదరని పక్షంలో కనీసం 5 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో టి‌డి‌పితో పొత్తు పెట్టుకున్నప్పుడు బి‌జే‌పికి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు. విశాఖ, నర్సాపురం, తిరుపతి, రాజంపేట సీట్లు ఇచ్చారు.

వాటిల్లో విశాఖ, నర్సాపురం సీట్లు మాత్రమే బి‌జే‌పి గెలిచింది. అయితే ఈ సారి 8 ఎంపీ సీట్లు వరకు అడుగుతున్నట్లు తెలిసింది. అటు జనసేన ఏమో 50 వరకు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. విశాఖ టూ గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం.

అయితే ఇలా బి‌జే‌పికి, జనసేనకు సీట్లు ఇస్తే టి‌డి‌పి నష్టపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓట్లు బదిలీ కావడం కష్టమవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీకి ప్లస్ అవుతుంది.