రాజు గారి వారసుడు ఎంట్రీ..టీడీపీలో సీటు ఎక్కడ?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే నేపథ్యంలో రఘురామ ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఇక తన పార్లమెంట్ పరిధిలోకి లోకేష్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన తనయుడుని పంపారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు..తమ తమ స్థానాల్లో లోకేష్ పాదయాత్ర జరిగినప్పుడు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇప్పుడు రఘురామ ఎలాగో రాలేరు కాబట్టి ఆయన తనయుడు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీంతో రఘురామ టి‌డి‌పి వైపుకు వెళుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనే డైరక్ట్ పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇక నరసాపురంలో పోటీ చేస్తారా? లేదా రాజమండ్రిలో పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పొత్తులో భాగంగా నరసాపురం జనసేన లేదా బి‌జే‌పికి దక్కే ఛాన్స్ ఉంది.

దీంతో రఘురామ రాజమండ్రి పరిధిలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా పొత్తుల బట్టే రఘురామ సీటు డిసైడ్ అవుతుంది.