టీడీపీ – జనసేన పొత్తు… బీజేపీ కలుస్తుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ములాఖత్‌లో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బీజేపీతో కలిసే ఉన్నానని… తమకో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయితే ఈ ప్రకటన చేసి పది రోజులవుతున్నా… ఇప్పటి వరకు మరో అప్‌డేట్ మాత్రం రాలేదు. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తొలి రోజుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ… అధిష్ఠానం ఆదేశాలతో ఆ తర్వాత నుంచి నోటికి తాళం వేశారు. పొత్తులపై మీ అభిప్రాయం ఏమిటీ అంటే… చాలా వరకు నో కామెంట్ అంటూ జవాబిచ్చారు తప్ప… కనీసం ఆఫ్ ది రికార్డు మాట్లాడేందుకు కూడా ధైర్యం చేయలేదు.

తాజాగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ తమకు మిత్రపక్షం అని పవన్ స్వయంగా చెప్పారు కదా అని వ్యాఖ్యానించిన పురంధేశ్వరి… అదే సమయంలో పొత్తు అనేది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని వెల్లడించారు. తమది జాతీయ పార్టీ అని… ప్రాంతీయ పార్టీ కాదని గుర్తు చేశారు. పొత్తుల విషయంపై జాతీయ స్థాయి నేతలతో పవన్ చర్చిస్తారని స్వయంగా చెప్పారని… పురంధేశ్వరి అన్నారు. జాతీయ స్థాయి నేతలు ఏం చెబితే… తాము అలాగే నడుచుకుంటామని మరోసారి స్పష్టం చేశారు పురంధేశ్వరి. అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో కూల్చివేతలే జరుగుతున్నాయని… ప్రజా వేదిక కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టారని… వైసీపీ పాలనను తొలి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తోందని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి. దీంతో పొత్తుల అంశం జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయం అని పురంధేశ్వరి తేల్చేశారు.