మామూలుగా ఒక్క హీరో తెరపై కనిపిస్తేనే అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కథ బాగుంటే ఈ జనరేషన్ హీరోలు కూడా ఈగోలకు పోకుండా మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అలా వచ్చిన సినిమానే `భీమ్లా నాయక్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పోషించారు.
మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి అధికారిక రీమేక్ ఇది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా గత ఏడాది ఆరంభంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఎస్‌ఐ భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియల్ శేఖర్ గా రానా.. ఇద్దరూ నువ్వా-నేనా అనేలా నటించారు.
అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. డేనియల్ శేఖర్ పాత్రకు రానా ఫస్ట్ ఛాయిస్ కాదు. మొదట ఈ రోల్ కోసం మాస్ మహారాజా రవితేజను అనుకోగా.. చేతి నిండా సినిమాలు ఉండటం వల్ల ఆయన నో చెప్పారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గోపీచంద్ పేరు సూచించాడట. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రానా పర్ఫెక్ట్ అని చెప్పాడట. దాంతో రానాను కలిసి కథ చెప్పగా.. ఆయన వెంటనే ఓకే చెప్పడం, సినిమాను పట్టాలెక్కించడం, హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి అలా పవన్ కళ్యాణ్-గోపీచంద్ కాంబోలో భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిపోయింది.