చంద్రబాబు అరెస్టుతో ఫుల్ క్లారిటీ….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఏకంగా రూ.371 కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఆయన అరెస్టు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు ముందస్తుగా కీలక నేతలను హౌస్ అరెస్టులు చేయడంతో… ఎవరి ఇళ్లల్లో వారే మిగిలిపోయారు. ఇక బాబు అరెస్టు తర్వాత ఇంతకాలం తెర వెనుకగా ఉన్న టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు విషయం తెలుసుకున్న తర్వాత సొంత పార్టీ నేతల కంటే పవన్ వేగంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం చేరుకోవాలని పవన్ భావించారు. అయితే అధికారులు అనుమతి నిరాకరించడంతో… అనూహ్యంగా రోడ్డు మార్గంలో పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఏపీ-తెలంగాణ బార్డర్ వద్ద పవన్‌ను ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో… అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి కాలినడకన విజయవాడ వెళ్తానంటూ పవన్ హంగామా సృష్టించారు. పోలీసుల తీరుకు నిరసనగా రొడ్డుపై పడుకున్నారు కూడా. అయితే చివరికి పవన్‌ను నేరుగా మంగళగిరి తీసుకువెళ్లారు పోలీసులు. ఆ తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చారిత్రక తప్పిదం చేసిందన్నారు. లోకేశ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

ఇక చంద్రబాబును కుటుంబ సభ్యులు కలిసిన వెంటనే… పవన్‌ కూడా జైలులో ములాఖత్‌కు అనుమతి తీసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, లోకేశ్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ కలవనున్నారు. దీంతో ఇంతకాలం తెర వెనుకే ఉన్న పొత్తు వ్యవహారం ఇక ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఇప్పటి నుంచి టీడీపీతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నారంటున్నారు.