మరోసారి ముందస్తు మాట… ఈ టూర్ అందుకేనా….!?

ముందస్తు ఎన్నికలు అనే మాట ఇప్పట్లో వెనక్కి తగ్గేలా లేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలలు సమయం ఉంది. వచ్చే ఏడాది మే నెల వరకు కేంద్రంలో మోదీ సర్కార్‌కు, ఏపీలో జగన్ ప్రభుత్వానికి గడువుంది. కానీ ఏడాది ముందు నుంచే ముందస్తు మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కాస్త వెనక్కి జరిపి… ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాస్త ముందుకు జరిపితే… ఒకేసారి 11 రాష్ట్రాలకు అటు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరిపించే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు మిగులుతుందనేది కేంద్రం వాదన. ఈ మాటకు కొన్ని పార్టీలు ఏకీభవిస్తున్నప్పటికీ… కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

జమిలి ఎన్నికల నిర్వహణ కోసమే ఈ నెల 17 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైందనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమిలి జరిగే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఊహాగానాలు ఆసక్తి కరంగా మారాయి. మంగళవారం తెల్లవారుజామునే విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న జగన్… రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి, చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలపై అధికారులతో చర్చించారు.

ఆ వెంటనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా జగన్ కోరినట్లు తెలుస్తోంది. వారితో భేటీలో చంద్రబాబు అరెస్టు కారణాలు, అనంతర రాజకీయ పరిణామాలను జగన్ వివరించే అవకాశం ఉందంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమైతే… తాము కూడా రెడీ అని భరోసా ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో జగన్ ఢిల్లీ పర్యటన పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.