యువగళం పాదయాత్రకు బ్రేక్… జగన్‌కు కావాల్సింది ఇదేనా…..!

యువగళం పేరుతో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. తొలి రోజుల్లో కాస్త చప్పగా సాగిన పాదయాత్ర…. ఇప్పుడు మాత్రం జోరుగా సాగుతోంది. 200 రోజులు పూర్తి చేసుకున్న యాత్ర….. మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాదయాత్రకు లోకేశ్ బ్రేక్ వేశారు.

స్కీల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో రూ.371 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ… టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో శనివారం ఉదయం ఆఘమేఘాల మీద విజయవాడ చేరుకున్న లోకేశ్… 5 రోజులుగా తండ్రి దగ్గరే ఉండిపోయారు. రెండు రోజుల పాటు కోర్టు పనుల్లో మునిగిపోయిన లోకేశ్… సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరిపారు. రిమాండ్ రాకుండా ప్రయత్నాలు చేశారు. చివరికి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో… చంద్రబాబు వెంట లోకేశ్ కూడా నేరుగా రాజమండ్రి చేరుకున్నారు. ఆయన అలా జైలులోకి వెళ్లిన వెంటనే… పక్కనే ప్రత్యేక బస్సులో బస ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి జైలుు సమీపంలోనే బస్సులో బస చేస్తున్న లోకేశ్… చంద్రబాబు బయటకు వచ్చేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై న్యాయ నిపుణులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

ఇక తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేశ్… జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మీడియాతో ఒక్కమాట కూడా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా తన మామయ్య బాలకృష్ణ, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి మరోసారి చంద్రబాబును కలవనున్నారు. హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటీషన్ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడటంతో… అప్పటి వరకు ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి. దీంతో లోకేశ్ కూడా మంగళవారం వరకు రాజమండ్రిలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఇప్పటికే యువగళం పాదయాత్రకు మంచి పబ్లిసిటీ వస్తుందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో… యాత్రకు బ్రేక్ వేయాలని వైసీపీ నేతలు శతవిధాలుగా యత్నించారు. కానీ చంద్రబాబు అరెస్టుతో ప్రస్తుతం పాదయాత్ర నిలిచిపోయింది. దీంతో ఫోకస్ మొత్తం చంద్రబాబు వైపు మళ్లడంతో… యువగళం పాదయాత్ర గురించి మాట్లాడే వాళ్లే లేకుండా పోయారు.