చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇది ఎన్నోసారో తెలుసా..?

మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హై డ్రామా తర్వాత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో… ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. వాస్తవానికి చంద్రబాబును అండర్ ట్రైల్ ఖైదీ కింద రిమాండ్ విధించడం ఇదే మొదటిసారి. ఆయనకు జైలులో 7691 నంబర్ కూడా కేటాయించారు. వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నప్పటికీ… ఆయన ప్రస్తుతానికి అండర్ ట్రైల్ ఖైదీ అనేది వాస్తవం. అయితే చంద్రబాబు తొలిసారి జైలులోకి వెళ్లారంటున్న తెలుగు తమ్ముళ్ల మాట మాత్రం అవాస్తవం. ఎందుకంటే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఇది రెండోసారి. అది కూడా ఒకే ఏడాదిలో ఇలా రెండుసార్లు జైలుకు వెళ్లారు చంద్రబాబు.

రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులను ఈ ఏడాదిలోనే సీబీసీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చిట్‌ఫండ్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో భవాని భర్త, టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరికి రిమాండ్ విధించడంతో… రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల అక్రమ అరెస్టు అంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. అలాగే ప్రభుత్వం కక్ష సాధిస్తోందని కూడా ఆరోపించారు. వాస్తవానికి అది చిట్‌ఫండ్ సంస్థ అక్రమాల కేసు అయినప్పటికీ… దానిని పార్టీ నేతలపై దాడులనే కోణంలోకి మార్చేశారు.

ఇక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని… పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుకు సొంత అన్న కుమార్తె కావడంతో… ఈ అరెస్టు వ్యవహారం మరింత ప్రచారం అందుకుంది. అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల కోసం వెళ్లిన చంద్రబాబును… అచ్చెన్నాయుడు నేరుగా జైలు వైపు వెళ్లేలా చేశారనేది టీడీపీ నేతల మాట. అప్పటి వరకు కనీసం ఒక్కరి కోసం కూడా జైలు గడప తొక్కని చంద్రబాబు… ఆదిరెడ్డి వాసు, అప్పారావు కోసం మాత్రం జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని ఓదార్చారు. ఆ తర్వాత పది రోజులకు వాసు, అప్పారావులకు బెయిల్ రావడంతో వారిద్దరు బయటకు వచ్చారు. వారిద్దరిని పరామర్శించడానికి తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు… అదే జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆదిరెడ్డి ఎఫెక్ట్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.