బాబు కేసుల్లో ట్విస్ట్‌లు..అదే డౌట్?

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తెరపైకి వచ్చింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసు, అటు అంగళ్ళులో అల్లర్లు కేసు ఇలా పలు కేసులుపై వరుసగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వీటిపై బాబు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోగా, వాటిపై కోర్టులో విచారణ జరగనుంది.

అయితే తాజాగా స్కిల్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వంలో పబ్లిక్‌ సర్వెంట్లు, అధికారులు తీసుకున్న నిర్ణయాలను ఆసరాగా చేసుకుని.. తర్వాత వచ్చే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా నిరోధించేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17(ఏ)ని తీసుకొచ్చారని,  ప్రస్తుత ప్రభుత్వ ప్రతీకార చర్యల్లో భాగంగానే చంద్రబాబును కేసులో నిందితుడిగా చేర్చారని చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

అలాగే అన్ని పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అందాయని జగన్‌ సర్కారే ప్రశంసించిందని, వేరే కేసులో ఐటీ నోటీసుల ఆధారంగా బాబుపై ఆరోపణలు హాస్యాస్పదమని, కేసు నమోదుకు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని, సీఐడీ కేసు, రిమాండ్‌ చెల్లుబాటు కావని వాదనలు చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా వినిపించారు.  ఇక షెల్‌ కంపెనీలకు మళ్లించిన సొమ్ము ఎవరికి వెళ్లిందో తేల్చాల్సి ఉందని, ఈ దశలో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయొద్దు.. సీఐడీ సీనియర్‌ లాయర్లు వాదించారు. ఇలా ఇరుపక్షాల మధ్య వాదనలు విన్న కోర్టు..తీర్పు రిజర్వ్ చేసింది..రెండు రోజుల్లో తీర్పు వెలువరించనుంది.

ఇది ఇలా ఉండగా ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ తాజాగా ఏసీబీ కోర్టులో పిటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ కేసులో బాబుని ఏ25 నిందితుడిగా చేర్చారు. అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ ఇప్పటికే ఇదే రకమైన పీటీ వారెంట్ దాఖలు చేయటంతో..దీని పైన హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోస దరఖాస్తు చేసారు. దీని పైన హైకోర్టు ఈ నెల 22న విచారణ చేయనుంది. అటు ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో బాబు బెయిల్ దరఖాస్తుపై వాదనలు కూడా జరగనున్నాయి. మొత్తానికి బాబుపై వరుసగా కేసులు వస్తుంటే..ఇటు బెయిల్ దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. మరి చివరికి ఈ కేసుల్లో ఏం తేలుతుందో చూడాలి.