విజయదశమి నుంచి విశాఖలో పాలన… సాధ్యమేనా….!?

నేటికి నాలుగు సంవత్సరాల నుంచి వింటున్న మాట… ఏ క్షణంలో అయినా విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని …. దసరా, సంక్రాంతి , ఉగాది వంటి పండుగలు ప్రతి ఏడాది వస్తూనే ఉన్నాయి. కానీ మళ్లీ తాజా ముహుర్తం వచ్చే నెల 23న ఫిక్స్ అయింది. విజయదశమి నుంచి పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని క్యాబినెట్ మీటింగ్‌లో సిఎం చెప్పినట్టు మంత్రులు ప్రచారం చేశారు.

వచ్చే నెల అంటే అక్టోబర్ 23వ తేదీన తెలుగువారికి ప్రీతిపాత్రమైన విజయదశమి దసరా పండుగ… ఆరోజు నుంచి పరిపాలనను విశాఖ నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి బుథవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. క్యాబినెట్ సమావేశంలో అధికారులను బయటకు పంపి ముఖ్యమంత్రి కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. ఆ సమయంలో విజయదశమి నుంచి విశాఖలో పాలన ప్రారంభమవుతుందని సిఎం చెప్పినట్టు మంత్రులు బయట ఆఫ్‌ ది రికార్డ్ గా చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తరువాత, ఈ బిల్లును హైకోర్టులో రైతులు సవాల్ చేయడంతో విచారణ జరుగుతున్న సమయంలో శాసనసభ, మండలి నుంచి వెనక్కి తీసుకున్నారు. సవరణలతో మళ్లీ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈలోపు, హైకోర్టు మూడు రాజధానుల బిల్లు చెల్లదని , రాజధాని అమరావతిగా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం శాసనసభ, శాసనమండలి ఒకసారి ఆమోదించిన తరువాత మళ్లీ అదే అంశం పై బిల్లు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఒకసారి రాజధాని అమరావతి అని తీర్మానం చేసిన తరువాత… మరోసారి అదే అంశం పై తీర్మానం చేసే శాసనాధికారం… శాసనసభకు లేదని స్పష్టం చేసింది. రైతులు రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ ఒప్పందం ద్వారా భూములు ఇచ్చారని, ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది. రిట్ ఆఫ్‌ మ్యాండమస్ ను విధించింది. ఈ నేపథ్యంలో అసలు మూడు రాజధానుల బిల్లే ఉనికిలో లేనప్పుడు .. విశాఖ నుంచి పాలన ఎలా సాగిస్తారని ముఖ్యమంత్రి ప్రకటన ప్రజలను మభ్య పెట్టేందుకేనని హైకోర్టు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు.

శాఖాధిపతుల కార్యాలయాలను రాజధాని నుంచి ఎట్టిపరిస్థితుల్లో కూడా తరలించేందుకు వీలు లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించాలని, మొత్తం తీర్పును కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ కేసు విచారణ డిసెంబర్ కు వాయిదా వేశారు. ఆర్‌-5 జోన్ ను ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ, ఇళ్ల నిర్మాణం పై కూడా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. దీని పై సుప్రీంకోర్టులో సవాల్ చేసినా కేసు విచారణ అదే బెంచ్ కు వెళ్లి వాయిదా వేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి తాను విశాఖపట్నం వెళతానని విజయదశమి నుంచి పాలన అక్కడి నుంచే జరుగుతుందని ప్రకటించడం వివాదంగా మారింది. క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగలరేమో కానీ, ఆయన పాలన మార్చడం అనేది హైకోర్టు తీర్పుకు, చట్టానికి విరుద్దమని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.

విశాఖలో ఋషికొండ పై పర్యాటక శాఖ నిర్మిస్తున్న అతిథి గృహంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉంటుందని ఇప్పటికే చెబుతున్నారు… ఆయన అక్కడే నివాసం ఉంటారని కూడా అంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా అనుమతులను అతిక్రమించి నిర్మించిన అతిథి గృహం పై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం అక్కడ నివాసం కూడా వివాదంగా మారనుంది. ముఖ్యమంత్రి విశాఖ వెళితే ఆయన పేషీతో పాటు, శాఖల సమీక్షకు కూడా ఆయా శాఖల అధికారులు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు అధికారులు విజయవాడ నుంచి విశాఖకు మధ్యాహ్నం ఫ్లైట్ లో ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి మూడు రోజులు విశాఖలో, మిగతా మూడు రోజులు విజయవాడలో ఉంటారని అంటున్నారు.

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వైసిపి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో పాలనా రాజధాని వస్తుందని, మూడు రాజధానుల ప్రకటనలో చెప్పిన ముఖ్యమంత్రి చివరకు విశాఖ వెళ్లి అక్కడ ప్రజల సానుభూతి పొందేందుకు, అన్న మాటకు కట్టుబడి ఉంటారని ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.