అందరి చూపు రాజ్‌భవన్ వైపే… గవర్నర్ నిర్ణయం ఏమిటీ…?

తెలంగాణలో అందరి చూపు రాజ్ భవన్ వైపే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ విలీన బిల్లు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానిని ఆర్డినెన్స్‌గా మార్చి… గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. బిల్లును గవర్నర్ పక్కన పెట్టారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు. రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై పలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు గవర్నర్. వాటికి ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో వారికి కూడా సానుకూలంగా స్పందించారు గవర్నర్. బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కార్మిక సంఘాలు కోరాయి. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం అనే అంశం తొలి నుంచి మలుపులు తిరుగుతోంది. అసలు విలీనం సాధ్యం కాదంటూ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసి సీఎం కేసీఆర్… సరిగ్గా అసెంబ్లీ సమావేశాల ముందు విలీన నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళి సై పుదుచ్ఛేరి పర్యటనకు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదం లభించదనే పుకార్లు వెల్లువెత్తాయి. అలా జరగకపోతే ఎన్నికల తర్వాతే జరుగుతుందని కార్మికుల్లో భయం వెల్లువెత్తింది. దీంతో ఆఘమేఘాల మీద రాజ్ భవన్‌ ను ముట్టడించారు కార్మికులు.

గవర్నర్ తమిళి సై, ప్రభుత్వం మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయి. వీటికి ఆఘమేఘాల మీద ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. అయినా సరే గవర్నర్ మాత్రం ఆ బిల్లును పక్కన పెట్టారు. రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకున్నా… చట్టానికి తగ్గట్లుగానే ప్రభుత్వ నియమాలను తయారు చేస్తుందని ప్రభుత్వం గవర్నర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఉద్యోగులు, ప్రజలల ప్రయోజనాలను కాపాడటమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు లక్ష్యమని రాజ్ భవన్‌కు కేసీఆర్ సర్కార్ జవాబిచ్చింది. దీంతో ఈ సెషన్‌లో ఆర్టీసీ విలీన బీల్లుకు ఆమోదం లభిస్తుందో లేదో అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.