టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక పవన్ కూడా వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే పూర్తిగా మంగళగిరికి మకాం మార్చేశారు. నిరంతరం పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే తాజాగ పవన్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టార్గెట్ వైసీపీ అని ఫిక్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అవసరమైతే పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అని ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఖాయమనే పుకార్లు మొదలయ్యాయి. ఇప్పటికి చంద్రబాబు – పవన్ కల్యాణ్ మూడు సార్లు భేటీ అయ్యారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లే అంటున్నారు పార్టీ నేతలు కూడా. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు.. పవన్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పురందేశ్వరి ప్రకటన నేపథ్యంలో మూడు పార్టీలు కలుస్తాయా… లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో ఎన్‌డీఏ కూటమి సమావేశానికి పవన్ ఒంటరిగా హజరయ్యారు. ఆ తర్వాత నుంచి పరిణామాలు మారినట్లు తెలుస్తోంది.

ఓ వైపు పొత్తుల ప్రస్తావన నడుస్తున్న సమయంలోనే… పవన్ కీలక ప్రకటన చేశారు. అదే అభ్యర్థి ప్రకటన. వాస్తవానికి పొత్తులు కుదిరిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీ. దీని వల్ల రెండు పార్టీల్లో పోటీ చేస్ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ పవన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అనూహ్యంగా తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అని ప్రకటించారు. దీంతో… అక్కడ టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. వాస్తవానికి తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల పేరు ప్రకటించడంతో… అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నయి. దీనికి జనసేన నేతలు కూడా ఘాటుగా బదులిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా పలు చోట్ల అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నారని… అదే పని పవన్ చేస్తే తప్పెంటని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పొత్తు ఉంటుందా… ఉండగా అనే ప్రశ్న తలెత్తుతోంది.