సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు… చెక్ పడుతుందా….?

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే అధికారం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈసారి సత్తెనపల్లిలో ఎలాగైనా సరే గెలవాలని టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చి విజయం సాధించారు చంద్రబాబు. ఆయనకు స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయన కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబుపై పోటీ చేసిన కోడెల ఓడిపోయారు. ఆ తర్వాత ఏడాది కాలానికే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కూడా. దీంతో 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు కోసం టీడీపీలో చాలా ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సత్తెనపల్లి. ఆయన అటు టీడీపీ అధినేత చంద్రబాబు పైన, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బ్రో సినిమా విషయంలో ఏకంగా ఐటీ శాఖకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ కూడా వెళ్లారు. దీంతో సత్తెనపల్లిలో అంబటి రాంబాబును ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ, జనసేనల లక్ష్యం. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో ప్రత్యేకంగా పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా సత్తెనపల్లిలోనే నిర్వహించారు. అటు చంద్రబాబు కూడా… సత్తెనపల్లి నుంచి నలుగురు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నప్పటీ… వారిని కాదని… కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను ఇంఛార్జ్‌గా నియమించారు. దీంతో ప్రధానంగా కాపు ఓట్లే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నియోజకవర్గంలో తొలి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్న కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే ఒక వర్గం నేతలను దగ్గరకు తీసుకున్నారు. గతంలో కూడా అన్నా క్యాంటిన్ ఏర్పాటు విషయంలో, చంద్రబాబు పర్యటన సమయంలో కూడా సత్తెనపల్లిలో గ్రూప్ రాజకీయాలు తలెత్తాయి. అయితే కన్నా రాకతో అవన్నీ సద్దుమణుగుతాయని అంతా భావించారు. కానీ తాజాగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పలువురు టీడీపీ నేతలకు నోటీసులిచ్చారు. కన్నా లక్ష్మీనారాయణకు సహకరించాలని… లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ లేఖలో ప్రస్తావించారు. వారంతా కోడెల శివరామ్ వెనుక తిరుగుతున్న నేతలే. వీరికి ఇప్పుడు పార్టీ నోటీసులు ఇవ్వడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోతే కోడెల ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. అదే జరిగితే… పార్టీ ఓట్లు చీలడంతో.. కన్నా ఓడిపోవడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు. దీంతో ఇప్పటి నుంచే టీడీపీ అధినేత దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.