కుడి ఎడమైతే..టీడీపీ-జనసేనల్లో కన్ఫ్యూజన్.!

అసలు టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ఏ ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది? టి‌డి‌పి బలంగా ఉన్న సీట్లని జనసేన కోసం వదులుకుంటుందా? అసలు టి‌డి‌పి-జనసేన మధ్య ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతవరకు పొత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. అటు చంద్రబాబు, ఇటు పవన్ ఎవరికి వారు తమ పార్టీలని బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు.

ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. కాకపోతే కింది స్థాయి కేడర్ మాత్రం సీట్ల కోసం లొల్లి చేస్తున్నారు. కొన్ని సీట్ల విషయంలో టి‌డి‌పి-జనసేన శ్రేణుల మధ్య వార్ జరుగుతోంది. ఆ సీటు తమకంటే తమకని గొడవ పడుతున్నారు. ఇదే సమయంలో టి‌డి‌పి బలంగా ఉన్న సీట్లలో పవన్ పర్యటిస్తున్నారు. ఇటు జనసేన బలంగా ఉన్న సీట్లలో బాబు పర్యటిస్తున్నారు. ఇటీవల పవన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా టూర్‌ల్లో అదే చేశారు. టి‌డి‌పి బలంగా ఉన్న సీట్లలో కూడా తిరిగారు. అలాగే కొన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.

అలా పవన్ పోటీ చేయడంపై ప్రకటన చేయడంతో టి‌డి‌పి శ్రేణుల్లో అసంతృప్తి కనిపించింది. ఇటు బాబు కూడా అదేవిధంగా ముందుకెళుతున్నారు. తాజాగా పవన్ విశాఖ సిటీ, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో తిరిగారు. భీమిలిలో పర్యటించడానికి రెడీ అయ్యారు.

ఇప్పుడు బాబు మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఏ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది.  ఇలా రెండు పార్టీల్లో సీటు విషయంలో క్లారిటీ లేదు.