రిషికొండ వివాదం..విశాఖ జనమే తేల్చేస్తారా?

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రిషికొండ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసినే. వైసీపీ ప్రభుత్వం..పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విశాఖలోని రిషికొండని తవ్వేసి..అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు సి‌ఎం జగన్ నివాసం ఉండటానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అసలు ప్రకృతిని నాశనం చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్ట కూడదని ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే రిషికొండపై అటు చంద్రబాబు, ఇటు పవన్ ఫైర్ అయ్యారు. రిషికొండలోని నిర్మాణాలు పరిశీలించారు. ఇక రిషికొండని తవ్వేయడంపై కొందరు కోర్టుకు, ఎన్‌జి‌టికు వెళ్లారు. ఈ క్రమంలో రిషికొండ తవ్వకంపై కోర్టు ఫైర్ అయింది. దీంతో తవ్విన చోట గ్రీన్ మ్యాట్ కప్పారు. అయితే ఇలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదనే వాదన వస్తుంది. దీనిపై కోర్టులో, అటు ఎన్‌జి‌టిలో వాదనలో నడుస్తున్నాయి. కానీ ఈ లోపు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అక్కడ మొదట ప్రభుత్వ సచివాలయ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. తర్వాత పొరపాటు జరిగింది…అక్కడ టూరిజంకు సంబంధించిన కట్టడాలు నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలా విరుద్ధమైన కామెంట్స్ వైసీపీ నుంచి వస్తున్నాయి. అదేమంటే దేవుడు కొండలపై ఉండటం లేదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేవుడు, జగన్ ఒక్కటేనా అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

అయితే  రుషికొండ కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) పరిధిలో ఉంది. అటువంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం, పర్యాటకులకు ఉపయోగపడే గదులు, రిసార్టులు మాత్రమే నిర్మించాలి. కానీ ఇక్కడ పర్యాటకుల కోసమని చెప్పి సీఎం కార్యాలయం కోసం భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇందులో నిజాలు ఏంటి అనేది ప్రభుత్వానికే తెలియాలి..అక్కడ ఉన్న విశాఖ ప్రజలకు తెలియాలి. ఇక్కడ తప్పు జరుగుతుందో..ఒప్పు జరుగుతుందో రానున్న ఎన్నికల్లో ప్రజలే తేల్చాలి.