ఆ ఇద్దరి మధ్య… పొత్తు ఉన్నట్లా… లేనట్లా…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్లతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుండటంతో… ముందస్తు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.

రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమంటున్నారు జనసేన పార్టీ పవన్ కల్యాణ్. అందుకోసం అవసరమైతే పొత్తులు పెట్టుకుని… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడతామన్నారు కూడా. అన్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే మూడుసార్లు భేటీ అయ్యారు. ఇక ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ సమావేశ సమయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు పవన్. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయంగా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇటీవల జరిగిన పలు అంశాలు మాత్రం రెండు పార్టీల నేతలను కలవరపరుస్తున్నాయి.

పొత్తు ఉంటుందనే ఊహాగానాల మధ్యలోనే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పేరు పవన్ ప్రకటించగా… టీడీపీ అధినేత మాత్రం… ఇప్పటికే పూతలపట్టు, యర్రగొండపాలెం, గోపాలపురం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేశారు. అలాగే సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇస్తా అని కూడా చెప్పేశారు. దీంతో దాదాపు 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ అధినేత ఖరారు చేసినట్లైంది. ఇక ఏ నిమిషానైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్ల నేపథ్యంలో… ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం, సీట్ల లెక్క తేలకపోవడంతో… అసలు పొత్తు ఉంటుందా… ఉండదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల నేతలు.