లోకేశ్ పాదయాత్రలో భారీ మార్పులు… ఎందుకనీ…!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొదలైన యువగళం పాదయాత్ర… 6 జిల్లాలు పూర్తి చేసుకుని 7వ జిల్లాలో కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా పాదయాత్ర రూట్ మ్యాప్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఒకలా సాగిన పాదయాత్ర… ప్రకాశం జిల్లా నుంచి మారినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో దాదాపు ప్రతి నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర చేసిన లోకేశ్… ప్రకాశం జిల్లా నుంచి మాత్రం మరోలా సాగుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న రెండు నియోజకవర్గాలను లోకేశ్ టచ్ చేయకుండానే వెళ్లిపోయారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర చేయలేదు. సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి మీదుగా గుంటూరు జిల్లా వినుకొండ వెళ్లారు. దీంతో టీడీపీ కంచుకోటగా మారిన పర్చూరు వాసులు కాస్త నిరాశ చెందారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో సైతం… కేవలం వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోనే లోకేశ్ పాదయాత్ర చేశాడు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రం తూతూ మంత్రంగానే సాగింది. ఉదయం అలా వచ్చి… ఇలా సాయంత్రం ముగించారు. అంతే తప్ప… సత్తెనపల్లి పట్టణం వైపు లోకేశ్ చూడలేదు.

గుంటూరు నగరంతో పాటు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయకుండానే నేరుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైపు పాదయాత్ర సాగుతోంది. ఇక కృష్ణా జిల్లాలో సైతం… కేవలం నాలుగంటే నాలుగే నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా విజయవాడ శివారులోని పెనమలూరు మీదుగా నేరుగా గన్నవరం నియోజకవర్గం చేరుకుంటారు లోకేశ్. అంతే తప్ప జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం నియోజకవర్గాల ప్రస్తావనే ప్రస్తుతం లేదు. పెడన, పామర్రు, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల ప్రస్తావన కూడా ప్రస్తుతం తీసుకురావడం లేదు.