పవన్ మూడో విడత వారాహి యాత్ర.. ముహుర్తం ఖరారైందా…!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని కూడా పవన్ వెల్లడించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్… 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ కేవలం ఒక్కటే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది. రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఇప్పుడు వైసీపీకి మద్దతిస్తున్నారు. దీంతో చట్టసభల్లో జనసేనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అటు పవన్ కూడా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. దీంతో జనసేన పార్టీకి గుర్తు, గుర్తింపు కూడా లేకుండా పోయింది.

అయితే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని కంకణం కట్టుకున్నారు పవన్. అందుకే తన మకాం పూర్తిగా మంగళగిరి మార్చేశారు. ఇకపై మంగళగిరి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు టూరిస్ట్ స్టార్ అనే పేరును చెరిపేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తనకు గట్టి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అవకాశం ఉన్నప్పుడల్లా గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే… గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిస్తున్నారు పవన్. తాజాగా వారాహి యాత్ర సైతం అన్నవరంలో పూజలు నిర్వహించి.. కత్తిపూడి జంక్షన్ నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి కాకినాడ, కోనసీమ మీదుగా నరసాపురం వరకు అని ముందుగా రూట్ మ్యాప్ ప్రకటించారు. కానీ భీమవరం వరకు యాత్ర పొడిగించారు.

ఆ తర్వాత ఏలూరు నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టిన పవన్… దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో యాత్ర చేశారు. రెండో విడత యాత్రలో వలంటీర్ వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. కొందరు వలంటీర్ల కారణంగా వ్యక్తిగత సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. దీంతో వలంటీర్లు పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా మూడో విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధమయ్యారు. ఈ యాత్ర ఈ నెల 4వ తేదీ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఉండి, ఆచంట, పాలకొల్లు, నిడదవోలు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. భీమవరంలో మకాం వేసి… ఈ నాలుగు నియోజకవర్గాలు పర్యటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది… భీమవరంలో ఈ సారి ఎవరిత పపన్ భేటీ అవుతారు అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.