మంగళగిరికి మకాం మార్చేసిన పవన్ కల్యాణ్‌….!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరికి మకాం మార్చారు… నిన్న, మొన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరికి తరలించారు. ఇక సినిమా షూటింగ్‌లకు మాత్రమే పవన్‌ కళ్యాణ్‌  హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జనసేన తన కార్యకలాపాలను ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర  కార్యాలయంతో పాటు, జనసేనాధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా మంగళగిరికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి తరలించడంతో అక్కడ ఉన్న సిబ్బంది, కంప్యూటర్‌లు, ఫైల్స్ అన్నింటినీ మంగళగిరికి తీసుకొచ్చారు. రెండు రోజుల నుంచి ఇక్కడే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ను కలుసుకునేందుకు వచ్చే వారిని కూడా మంగళగిరికే రావాల్సిందిగా కోరుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌లు కూడా ఇక్కడే ఖరారవుతున్నాయి. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ కార్యాలయంలోనే బస చేస్తున్నారు. ఆయన కూడా కొంతమంది నేతలను కలుసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి వస్తున్న నేతలు పవన్‌ కళ్యాణ్‌, మనోహర్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడుగుతుండటంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సిబ్బంది వారి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌… కేంద్ర కార్యాలయంలోనే మకాం వేశారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న నేతలను కలుసుకోవడంతో పాటు, రాబోయే 15 రోజులు, ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చిస్తున్నారు. వారాహి మూడోవ విడత యాత్రను ఎప్పటి నుంచి చేపట్టాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్ర పూర్తి అవ్వడం, ఈలోపు వర్షాలు పడటంతో మూడోవ విడత వారాహి యాత్ర ఎప్పుడు ప్రారంభం కావాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్‌కు అనుకూలంగా ఉండే విధంగా బసను ఏర్పాటు చేశారు. పవన్‌ కళ్యాణ్ అందులోనే ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా పవన్‌ కళ్యాణ్‌ గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. సాయంత్రం వరకూ పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బంది, సంస్థాగత వ్యవహారాల పై నేతలతో మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌, సాయంత్రం తరువాత తనను కలిసేందుకు వస్తున్న సినిమా నిర్మాతలు, దర్శకులు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కలుసుకుంటున్నారు. ఇక షూటింగ్‌లు ఉంటే నేరుగా పవన్‌ కళ్యాణ్‌ ఆ ప్రాంతాలకు మంగళగిరి నుంచే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఎన్నికలకు ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఇక పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలపై దృష్టి సారించాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తుండటం, నియోజకవర్గాలపై కూడా సమీక్షలు నిర్వహిస్తుండటం, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర రాయలసీమ, కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తి చేసుకొని గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన తరుణంలో తెలుగుదేశం తన కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో, ఇక జనసేన కూడా తన కార్యక్రమాలను పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ నుంచే పూర్తిస్థాయిలో కార్యకలాపాలను చేపట్టాలని నిర్ణయించింది.