ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు పూర్తి చేశారు కూడా. అటు చంద్రబాబు కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ తిరిగిన బాబు… తాజాగా ప్రాజెక్టుల బాట అంటూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు.

ఓ వైపు అగ్రనేతలు ఈ స్థాయిలో కష్టపడుతుంటే… పార్టీలో కీలక నేతలు మాత్రం… తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గాల ఇంఛార్జ్ ఎంపికల మొదలు…. నివేదికల రూపకల్పన వరకు ప్రతి విషయం వీళ్లు చెప్పినట్లుగానే నడుస్తోంది. ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే… క్రమశిక్షణా చర్యల పేరుతో వేటు వేస్తున్నారు. దీంతో ఆ నలుగురిని ప్రసన్నం చేసుకుంటే… మనం రాజకీయాల్లో రాణించవచ్చు అనేది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న మాట.

అచ్చెన్నాయుడు కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. వరుసగా ఐదు సార్లు ఓడినా కూడా సోమిరెడ్డికే మరోసారి అవకాశం వస్తుందనేది బహిరంగ రహస్యం. అసలు సోమిరెడ్డి కారణంగానే నెల్లూరు జిల్లాలో టీడీపీ పట్టు కోల్పోయిందని.. అయినా సరే… మళ్లీ సోమిరెడ్డి చేతికే జిల్లా పార్టీ బాధ్యతలు చంద్రబాబు ఎందుకు ఇస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక 2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తున్న కుటుంబం యనమల. 2004లో యనమల రామకృష్ణుడు ఓడిపోగా… ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన సోదరుడు కృష్ణుడు ఓడిపోయాడు. అయినా సరే… రాబోయే ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి మళ్లీ యనమల కుటుంబానికే చంద్రబాబు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట. కానీ యనమల పెత్తనం కారణంగా జిల్లా నుంచి కీలకనేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారనేది బహిరంగ రహస్యం. పార్టీకి ఇంత నష్టం జరుగుతున్నా కూడా… మళ్లీ మళ్లీ యనమలకే చంద్రబాబు ఎందుకు పెత్తనం ఇస్తున్నారో అనేది జిల్లా నేతలకు కూడా అంతుబట్టని విషయం. పరిస్థితి ఇలాగే ఉంటే…. పార్టీ ఓడిపోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.