ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో సైతం విజయం సాధించారు. దీంతో అంతా భవానీపై పొగడ్తల జల్లు కురిపించారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పెత్తనం మొత్తం ఆమె భర్త ఆదిరెడ్డి వాసు చేతుల్లోకి మారిపోయింది. పేరుకే భవానీ ఎమ్మెల్యే అయినప్పటికీ… చక్రం తిప్పేది మొత్తం వాసు అనేది అందరికీ తెలిసిపోయింది.

వాసు పెత్తనం భరించలేక ఇప్పటికే రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో టీడీపీ కౌన్సిలర్లు 13 మంది వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసినా సరే… వారిని ఆదిరెడ్డి అప్పారావు వర్గం వేధింపులకు గురి చేస్తుందనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిట్‌ఫండ్ సంస్థ మోసం కేసులో సీబీసీఐడీ పోలీసులు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్ చేశారు. తండ్రికొడుకులను పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. అలేగా నేరుగా ఇంటికి కూడా వెళ్లారు. దీనిపై అప్పట్లో పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ సీనియర్ నేతలు జైలుకు వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు ఇలా వెళ్లి పరామర్శించలేదని.. కానీ ఇలా సొంత వ్యాపారంలో మోసం చేసినందుకు జైలుకు వెళ్లిన వారిని ఎలా పరామర్శిస్తారని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఆదిరెడ్డి తండ్రి కొడుకులు జైలుకు వెళ్లిన అసలు కారణం చంద్రబాబుకు తెలియకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టాడనే మాట కూడా వినిపిస్తోంది. ఇక రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు సభ సమయంలో కూడా ఆదిరెడ్డి వాసు భారీగా డబ్బులు వెనుకేసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గం నేత శిష్ట్లా లోహిత్‌ నుంచి కేవలం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.30 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్ని తెలుసుకున్న చంద్రబాబు… మహానాడు సభలో కనీసం ప్రసగించే అవకాశం కూడా ఇవ్వలేదనేది పార్టీ నేతల మాట. ఇక కుటుంబ వివాదాల కారణంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్తకు దూరంగా ఉంటున్నారట. పిల్లలతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారనే మాట వినిపిస్తోంది. ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు… ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ కారణాలతోనే ఆదిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.