జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. ఇక సచివాలయ వ్యవస్థ ద్వారా… ప్రజల వద్దకే పరిపాలన అనేలా పరిస్థితి మార్చేశారు. ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు.

వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై తొలిరోజుల్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఓ పిచ్చి నిర్ణయం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో వ్యాఖ్యానించారు. దాని ఫలితాలు మరో 6 నెలల్లో తెలుస్తాయి చూడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్. కానీ అదే సీఎం కేసీఆర్… తాజాగా తీసుకున్న ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి గవర్నర్ ఆమోదం లభించడమే మిగిలిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే వాస్తవానికి రాజకీయాల్లో కేసీఆర్ కంటే జగన్ చాలా జూనియర్. కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మాత్రం జగన్‌ను కాపీ కొట్టినట్లుగానే ఉంది. తొలినాళ్లల్లో విలీన నిర్ణయం అస్సలు సాధ్యం కాదన్నారు కేసీఆర్. ఆరు నెలలకే తిరిగి కార్పొరేషన్‌గా మార్చేస్తారని కూడా అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం మాత్రం… మూడేళ్లు దాటినా… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ముందుకు నడుస్తోంది. దీంతో కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే… అది పార్టీకి మంచి మైలేజ్ అవుతుందని కేసీఆర్ గుర్తించినట్లున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు కూడా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుందని కేసీఆర్ గుర్తించినట్లున్నారనే మాట ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తొలినాళ్లలో తీవ్రంగా తప్పుబట్టిన కేసీఆర్… ఇప్పుడు ఆదే సరైనది అని గుర్తించి… ఆయన కూడా అమలు చేస్తున్నారనే మాట పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.