టీడీపీ భారీ స్కెచ్.. ఒంగోలు ఎంపీ బరిలోకి కొత్త నేత…!

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ నేతలు పని చేస్తున్నారు. అయితే పార్టీలో నేతల మధ్య విభేదాలు అధినేతను కలవర పెడుతున్నాయనేది వాస్తవం. కొన్ని జిల్లాల్లో సీనియరే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇది ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడూ కూడా ఆయా నేతలు జిల్లా రాజకీయాలను శాసించారు. ఇక ఎన్నికల నేపథ్యంలో ఒకరికి ఒకరు పని చేసే అవకాశం కూడా ఉందనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరనే చెప్పాలి. గత ఎన్నికల్లో సైతం చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. అయితే ఈ సారి కూడా అలాగే చేస్తే మరోసారి ఓటమి తప్పదని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే ముందు నుంచే నియోజకవర్గాల్లో బలమైన నేతలను పోటీలో నిలిపేందురు ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. మాజీ గంటా శ్రీనివాసరావు ఒక జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత. ఆయన ఇప్పటికే విశాఖ జిల్లాను శాసించే స్థాయికి చేరుకున్నారు. చోడవరం ఎమ్మెల్యేగా మొదలైన ప్రయాణం… అనకాపల్లి ఎంపీ, భీమిలి, విశాఖ నార్త్.. ఇలా నియోజకవర్గాలు మారుస్తున్నారు గంటా. ఇదే సమయంలో విశాఖ జిల్లాలో గంటా వర్సెస్ అయ్యన్న పాత్రుడు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వీరిద్దరి సమస్యకు చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు విశాఖలో సెటిల్ అయినప్పటికీ… ఆయన సొంత జిల్లా మాత్రం ప్రకాశం. ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో ఆయనకు బంధువులున్నారు. పైగా మంత్రిగా ఉన్న సమయంలో కనిగిరి ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ శంకుస్థాపనకు వచ్చిన గంటాకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. మా గంటా అంటూ నినాదాలు కూడా చేశారు. దీంతో ఈసారి గంటాను ఒంగోలు పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల గంటా.. గెలుపు స్కెచ్ ఈజీగా వేయగలరని… అలాగే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా తన వంతు సహకారం అందివ్వగలరనేది బాబు నమ్మకం. అదే సమయంలో విశాఖ జిల్లాలో గంటా, అయ్యన్న మధ్య విభేదానికి కూడా చెక్ పడుతుందనేది బాబు ఆలోచన. గంటా సామాజికవర్గం కూడా ఒంగోలు నియోజకవర్గంలో అధికం. ఆ కోణంలో కూడా గంటా గెలుపు సునాయాసం అవుతుందనేది చంద్రబాబు ప్లాన్. మరి ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.