ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట…!

తెలుగుదేశం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒకటే… అదే ఎంపీ అభ్యర్థులు… ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా సరే… ఇప్పటికీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనేది తేలడం లేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో తప్ప… మిగిలిన చోట ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం మొదలు హిందూపురం వరకూ ఇదే పరిస్థితి. గతంలో పోటీ చేసిన వారిలో సగం మంది పార్టీలో లేరు. ఉన్న వాళ్లు కూడా ఏదో అలా అలా కనిపిస్తున్నారు తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు లేవు. దీంతో అసలు ఎవరిని ఎంపిక చేయాలనేది టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు అభ్యర్థులు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. రామ్మోహన్ నాయుడు నరసన్నపేట నుంచి, గల్లా జయదేవ్ చంద్రగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థులు ఎవరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

విశాఖ ఎంపీగా మరోసారి శ్రీభరత్ పేరు వినిపిస్తోంది… కానీ ఆయన మాత్రం భీమిలి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. విజయనగరం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి స్థానంలో ఆయన కుమార్తెను పోటీలో నిలపాలనేది బాబు ప్లాన్. అరకు నియోజకవర్గం నుంచి ఎవరూ కనిపించడం లేదు. రాజమండ్రి నుంచి మురళీమోహన్ కోడలు పోటీ చేసి ఓడారు. ఆమె స్థానంలో ఈసారి శిష్ట్లా లోహిత్ పేరు వినిపిస్తోంది. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. దీంతో అక్కడ కొత్త వారికే ఛాన్స్. అమలాపురం నుంచి గత ఎన్నికల్లో జీఎంసీ బాలయోగి కుమారుడు పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్ అయినప్పటికీ… ఆయన మాత్రం నియోజకవర్గంలో కనిపించటం లేదు. ఇక నరసాపురం నుంచి ఎవరు అనేది తెలియదు. గతంలో పోటీ చేసిన కలవపూడి శివ.. తన సొంత నియోజకవర్గం ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏలూరు నుంచి మళ్లీ మాగంటి బాబు పేరే వినిపిస్తోంది. ఇక విజయవాడ నుంచి కేశినేని నాని లేదా చిన్ని అంటున్నారు టీడీపీ నేతలు. మచిలీపట్నం నుంచి కొణకళ్ల నారాయణ మాత్రమే కనిపిస్తున్నారు.

గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నిస్తున్నారు. దీంతో గల్లా స్థానంలో కొత్త నేత తప్పేలా లేదు. ఇక నరసరావుపేట నుంచి పోటీచేసిన రాయపాటి వయోభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు నుంచి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. నెల్లూరు నుంచి పోటీ చేసిన బీద రవిచంద్ర ఎమ్మెల్యే టికెట్ కోసం చూస్తున్నారు. కర్నూలు నుంచి పోటీ చేసిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి టికెట్ కష్టమంటున్నారు పార్టీ నేతలు. కడప నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. అనంతపురం నుంచి మరోసారి జేసీ అశ్మిత్ రెడ్డి పోటీ చేయనున్నారు. కేవలం ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన చోట.. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీది.