నగరిలో ఆగని పోరు..రోజా తగ్గడం లేదా?

అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఆ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కొన్ని చోట్ల నేతలు సెట్ అవుతున్నారు..కానీ కొన్ని చోట్ల అవ్వడం లేదు. ఇదే క్రమంలో నగరి నియోజకవర్గంలో జరిగే ఆధిపత్య పోరుకు బ్రేకులు పడేలా లేవు. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు కొందరు వైసీపీ నేతలు యాంటీగా ఉన్నారు.

ఎప్పటినుంచో రోజాకు వ్యతిరేక వర్గం ఉంది. వారి మధ్య పోరు తారస్థాయిలోనే నడుస్తోంది. తాజాగా సి‌ఎం జగన్ సమక్షంలోనే పోరు మరింత బయటపడింది. జగన్ ఏమో అందరినీ కలపాలని ప్రయత్నిస్తుంటే..నేతల్ మాత్రం కలవడానికి ఇష్టపడటం లేదు. తాజాగా జగన్ నగరి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న రోజాని, ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కేజే శాంతిని కలపడానికి చూశారు..కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.

జగన్‌.. తొలుత కేజే శాంతితో మాట్లాడి, కలిసి పనిచేయండి అన్నట్టుగా మంత్రి రోజా వైపు చూపించారు. అయితే వారిద్దరూ ముఖాలు కూడా చూసుకోలేదు. సీఎం స్వయంగా వారి చేతులను పట్టుకుని కలిపే ప్రయత్నం చేశారు. కేజే శాంతి తన చేతిని ముందుకు చాచేందుకు ఇష్టపడలేదు. రోజా కూడా ఏదో మొక్కుబడిగా చేయి ఇచ్చారు. జగన్‌ గట్టిగా లాగి ఇద్దరి చేతుల్నీ బలవంతంగా కలిపారు. అయితే రెప్పపాటు కాలంలోనే ఇద్దరూ తమ చేతుల్ని వెనక్కి లాగేసుకున్నారు.

దీని బట్టి చూస్తే నగరి వైసీపీలో ఎలాంటి విభేదాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే రోజా సైతం తన వ్యతిరేక వర్గంతో కలవడానికి ఇష్టపడటం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగితే..ఎన్నికల సమయంలో వైసీపీకే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. రోజా గెలుపుకు సహకరించే అవకాశాలు ఉండవు.