ఎంపీ సీటుపైనే కేసీఆర్ ఫోకస్..చక్రం తిప్పగలరా?

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఏ సీటులో పోటీ చేస్తారు? మళ్ళీ గజ్వేల్ బరిలో నిలుస్తారా? లేక వేరే సీటుకు మారిపోయే ఛాన్స్ ఉందా? అది కాదు అనుకుంటే ఎంపీ సీటులో పోటీ చేస్తారా? అసలు ఆయన పోటీ చేసే సీటు క్లారిటీ రావడం లేదు. గజ్వేల్ బరిలో పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదొక సీటులో పోటీ చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది.

కామారెడ్డి బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం అదే చెబుతున్నారు. కే‌సి‌ఆర్..కామారెడ్డి బరిలో ఉంటారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావడం లేదు. కే‌సి‌ఆర్ ఎంపీ సీటులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఉంది. మొదట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయన మొదట అసెంబ్లీ సీటు బరిలో ఉంటారు..కానీ ఆ సీటు ఏదో ఇంకా క్లారిటీ లేదు. ఇక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి..మళ్ళీ సి‌ఎంగా ప్రమాణం చేసి..పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని టాక్.

అప్పుడు ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయన చూస్తున్నారు. ఇప్పటికే ఆయన మహారాష్ట్రపై కూడా ఫోకస్ చేశారు. తెలంగాణలో 17, మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 65 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చు అనేది కే‌సి‌ఆర్ ప్లాన్.

అయితే మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ ఎంపీ సీట్లు గెలవడం అనేది కషతమైన విషయమే. బలమైన బి‌జే‌పి, శివసేన, ఎన్‌సి‌పి, కాంగ్రెస్ లాంటి పార్టీలని దాటుకుని బి‌ఆర్‌ఎస్ ఒక సీటు గెలుచుకునే గొప్పే. ఇక తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ 17 ఎంపీ సీట్లు గెలవలేదు. 10 గెలిచిన చాలు. చూడాలి మరి కే‌సి‌ఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.