నగరిలో జగన్..రోజాకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా?

సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడం,, అభివృద్ధి పనులు ప్రారంభించడం పేరుతో సి‌ఎం జగన్..గత కొన్ని రోజులుగా ఏదొక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఆయా స్థానాల్లో వైసీపీ బలం పెరిగేలా జగన్ సభలు జరుగుతున్నాయి. ఓ వైపు పథకాలకు బటన్ నొక్కడం, మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతున్నారు.

ఇదే క్రమంలో ఈ నెల 28న నగరి నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కనున్నారు. ఇందులో భాగంగా నగరిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభని భారీ సక్సెస్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మంత్రి రోజా కూడా చూస్తున్నారు. ఎందుకంటే నగరిలో రోజాకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉంది. ఆ వర్గం ఆమెకు సీటు రాకుండా చేయాలని చూస్తుంది. ఆమెకు సహకరించకూడదని భావిస్తుంది. ఈ నేపథ్యంలో తాను సభని సక్సెస్ చేస్తే..నగరిపై పట్టు సాధించినట్లు అవుతుంది.

పైగా గత రెండు ఎన్నికల్లో ఆమె గెలిచింది తక్కువ ఓట్లతోనే..2014లో వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతో గెలిస్తే…2019లో 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ గెలుపు పెద్ద గొప్ప గెలుపు కాదు. అందుకే ఈ సారి మంచి మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక జగన్ సైతం..మరోసారి రోజాకే సీటు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు భారీ సభ ద్వారా నగరిలో మరింత బలం పెరిగేలా చేసి..రోజా హ్యాట్రిక్ కొట్టేలా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ బలపడుతున్న టి‌డి‌పి, అటు వైసీపీలో వ్యతిరేక వర్గం రోజా గెలుపుకు బ్రేకులు వేస్తాయో లేదో చూడాలి.