అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ చేశారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు అండ్ కో దారుణాలు చేసేశారనేది ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇదే అంశం మీద కాదు.. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చాలా డెవలప్మెంట్స్ మీద ఆర్జీవీ తనదైన స్టైల్‌లో స్పందించకుండా.. వెరైటీగా స్పందిస్తున్నారు. అమ్మో ఇంత దారుణమా..? ఇలా చేస్తే జీవితాలేమవుతాయి..? అసలు భయం లేదా..? ఇలాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు.
అలాగే పుంగనూరు ఘటనపై ఆర్జీవీ ఓపినీయన్స్ ఏంటంటే.. అహింసతో స్వాతంత్ర్యం వచ్చింది.. మళ్లీ హింస పెరుగుతోందట.. తరిమికొట్డండి అని నినాదాలు చేస్తే అది ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవుతుందా..? అని కూడా ఆర్జీవీ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై ఆర్జీవీ చాలా ఆవేదన చెందారు. అరే ఏంటీ ఇలా అయిపోతుందనే రీతిలో వర్మ బాధపడినట్టుగానే కన్పించింది. సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరించారని ఫీల్ అయ్యారు. వర్మలో ఈ రకమైన మార్పులు రావడం.. ఇలాంటి ప్రశ్నలు వేయడం మంచిదే. సమాజం గురించి.. ఇతరుల గురించి ఎంత మాత్రం పట్టించుకోరనే ముద్ర వేయించుకున్న రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఇలాంటి ప్రశ్నలు వేయడం మంచిదే. సమాజానికి మేలు జరిగే అంశమే. ఇవి సమాజానికి కూడా చాలా ఉపయోగకరమే. అయితే ఈ ప్రశ్నలు కానీ.. ఈ నీతి సూక్తి ముక్తావళి కానీ వేరే వారి నుంచి వస్తే అంతగా చర్చ జరగదు. కానీ రామ్ గోపాల్ వర్మ నోటి నుంచి ఈ తరహా ప్రవచనాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటోంది. అందుకే రామ్‌గోపాల్ వర్మలో వచ్చిన మార్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
జీఎస్టీ లాంటి నగ్న చిత్రాన్ని తీసిన రాము.. హింసాత్మక ఘటనలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీసిన వర్మ.. పొలిటికల్ సెటైరిక్ మూవీలతో రాజకీయ నేతలను ముప్పు తిప్పలు పెట్టిన ఆర్జీవీనేనా ఇలా మాట్లాడుతోంది.. ఇలా ఆవేదన చెందుతోంది అని అనిపిస్తుంది. సహజంగా ఇలాంటి సంఘటనల నుంచి స్ఫూర్తి పొందే రకం ఆర్జీవీ. ఇలాంటి సంఘటనలు తన చిత్రాలకు.. తన సినిమాకు కథలుగా ఎలా ఉపయోగపడతాయా..? అనే కోణంలోనే ఆలోచిస్తారు. బూతు చిత్రాలు.. హింసను ప్రేరేపించే చిత్రాలు ఎలా తీస్తారు..? దీని వల్ల సమాజం ఏమైపోతుంది..? అని ప్రశ్నిస్తే.. నేనింతే.. నా సినిమాలింతే.. చూస్తే చూడండి.. మానేస్తే మానేయండి.. నేనేం చూడమని చెప్పడం లేదే..? సమాజం తోటకూర అంటూ కబుర్లు చెప్పొద్దు. నేనేం సమాజాన్ని ఉద్దరించడానికి రాలేదు. మీరేం అనుకున్నా.. మీరేం చేసినా.. నేనింతే.. నా స్టైల్ ఇంతే అని తెగేసి చెప్పేసేవారు ఆర్జీవీ. ఇది చాలా చాలా ఛానెళ్లల్లో ఆయనే ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ప్రసారం అయింది కూడా.
అలాంటి ఆర్జీవీలో ఈ పరివర్తన రావడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇదే సందర్భంలో పరిటాల రవి, వంగవీటి రంగా వంటి వారి జీవిత చరిత్రలను తెరకెక్కించిన ఆర్జీవీ.. అంతకు మించిన ట్విస్టులతో రాజకోట రహస్యాలుగా మారిన.. మరెన్నో క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్ల గురించి ఎందుకు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా.. తనకున్న వ్యూహంతో తన పని తాను చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీని ఉద్దేశించి కొందరు రకరకాల కామెంట్లు.. ఆరోపణలు చేస్తూ ఉంటారు. జగన్‌కు ఆర్జీవీ అమ్ముడుపోయారని ఏదేదో మాట్లాడతారు. కానీ అలా భావించడానికి లేదు. ఆర్జీవీ అమ్ముడుపోయే రకం కాదు. ఆర్జీవీ ఎప్పుడూ అమ్మకానికి ఉండడు. జగన్‌లో ఏదో ఎలిమెంట్ నచ్చింది.. అంతే కనెక్ట్ అయ్యారు. ఈ ఎమోషనల్ కనెక్షన్‌కు కమర్షియల్ టచ్ ఇవ్వడం సరికాదనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఆర్జీవీలో మార్పు తెచ్చిన ఘనత మాత్రం జగనుకే దక్కింది.