రాజద్రోహం చట్టానికి కేంద్రం చెల్లుచీటీ… ఇకపై దేశ ద్రోహ చట్టం…!

రాజద్రోహం చట్టానికి కేంద్ర ప్రభుత్వం చెల్లుచీటీ పాడింది. నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. మూక దాడులకు మరణశిక్ష తప్పదని హెచ్చరించింది. కోర్టులో వాదనలు పూర్తయిన నెల రోజుల్లో తీర్పు చెప్పాలని సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరిరోజున ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. మరో పక్క అవిశ్వాస తీర్మానంపై మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో రెండు నిమిషాలు మాత్రమే మణిపూర్‌కు కేటాయించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇందుకోసం వలసవాద చట్టాల సమూల ప్రక్షాళనకు సిద్ధమైంది. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడంతోపాటు మూక దాడులకు పాల్పడితే మరణిశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు పొందుపరచినట్లు తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత బిల్లులో దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం కీలక ప్రతిపాదన. దీంతోపాటు మూక దాడులు, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే గరిష్ఠంగా మరణశిక్ష విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై విచారణ జరిపే నిబంధన చేర్చారు. పోలీసులు చేసే సెర్చ్ ఆపరేషన్లలో వీడియోగ్రఫీ, ఏడేళ్లు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫొరెన్సిక్‌ బృందం వెళ్లి పరిశీలించడం తప్పనిసరి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లులో అనేక కీలకాంశాలున్నాయి. ఇకపై రాజద్రోహం చట్టానికి బదులు దేశద్రోహం మాతమే ఉంటుందని అమిత్ షా విశదీకరించారు. ఇదీ గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ఆధారంగానే రూపొందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు ఉండవని చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా శిక్షార్హులేనన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో కేసుల పరిష్కారం పూర్తి కావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. డిశ్చార్జ్ పిటీషన్లన్నీ ఒకేసారి వేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. ఏ కేసులోనైనా 90 రోజుల్లో ఛార్జ్ షీటు వేయాల్సి ఉంటుందన్నారు. అలా కుదరని పక్షంలో మరో 90 రోజుల పొడిగింపునకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భారీగా ఆస్తినష్టం జరిగిన చోట నేరస్తుల ఆస్తులను జప్తు చేసి బాధితులకు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎలాంటి కేసులైనా 30 రోజుల వ్యవధిలో తీర్పులు ఇవ్వాలన్న నియమం ఉంటుందన్నారు.

ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తెర పడి, రెండు సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు ఈ సమావేశాలు కొనసాగాయి. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. సహకార సంఘాల బిల్లు, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, జన్ విశ్వాస్ సవరణ బిల్లు, ఢిల్లీ పాలనాధికారాల బిల్లు తదితర కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చివరి రోజు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను భర్తీ చేసేందుకు లోక్‌సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టారు.

ఇండియా కూటమి సభ్యులు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజుల పాటు వాడీ వేడి చర్చల తర్వాత మోదీ సమాధానమిచ్చారు. అరవై మంది సభ్యులు చర్చలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ రెండు గంటల సేపు సమాధానమిచ్చారు. మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని ప్రసంగించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మణిపూర్‌లో జనం చచ్చిపోతుంటే మోదీ సభలో జోకులు వేశారని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్ర సమస్యపై కేవలం రెండు నిమిషాలు మాట్లాడటం అభ్యంతరకమని రాహుల్ అన్నారు.