టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే పట్టించుకోకపోతే ఎలా…!?

ఓటర్ల జాబితాలో అవకతవకలపై రోడ్డెక్కిన టీడీపీ.. అవకాశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది. మొదటి నాలుగు రోజులు ఇంటింటి తనిఖీలు అంటూ హడావుడి చేసిన క్యాడర్‌.. ప్రస్తుతం అటువైపు కూడా వెళ్లడం లేదు. ఇంచార్జ్‌ల అలసత్వమే అందుకు కారణమవుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం సాగుతోంది. బూత్ లెవల్ ఏజెంట్‌లతో టీడీపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. ఓటర్ల జాబితా పరిశీలపై ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం అధినేత.. ఇంచార్జీల ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాలకు ఒక్కో సీనియర్ నేతను నియమించారు. అయితే.. వారిలో కొంతమందికి ఇంచార్జ్‌లను నియమించినట్టుగా కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ అంశంపై మళ్లీ ఓ నివేదిక చంద్రబాబు వద్దకు వెళ్లింది.

ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. 13 రకాల క్యాటగిరీల్లో ఉద్యోగులతో జాబితా సిద్ధమైంది. అయితే.. వాళ్లను కాకుండా ఇంకెవరినైనా నియమించాలంటే.. ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. వైసీపీ ప్రభుత్వం 13 రకాల ఉద్యోగులను కాకుండా సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వోలుగా నియమించేందుకు ఈసీ నుంచి అనుమతి తీసుకుంది. వారంతా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన వాళ్లే. సచివాలయ ఉద్యోగులు బీఎల్‌వోలుగా నియమకం అవడానికి ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పలేదు. ఫలితంగా అనేకమంది బీఎల్‌వోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. వలంటీర్లను వెంట పెట్టుకుని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన బీఎల్‌వోలపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మరికొందరిపై వచ్చిన ఆరోపణలపై నివేదిక పంపాలని కలెక్టర్లను సీఈవో ఆదేశించారు.

ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ మరో పది రోజుల్లో పూర్తి కానుంది. ఈలోపు టీడీపీ హైకమాండ్ ఎక్కడైతే బీఎల్‌వోలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్‌లు వెళ్లడం లేదో.. ఆ నియోజకవర్గాల నుంచి డేటా తెప్పించుకొని నేరుగా చంద్రబాబుకు ఇస్తున్నారు. వారిపై చంద్రబాబు ఇక రానున్న వారంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తీవ్ర స్థాయిలో హెచ్చరించాలని నిర్ణయించారు. ఓటర్ల జాబితాలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు లేకపోతే నష్టపోయేది మీరేనని కూడా చంద్రబాబు కొంతమంది నేతలకు చెప్పడంతో పాటు, అవసరమైతే.. అటువంటి నేతలపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది.