ఆ పదవులతో ఎమ్మెల్యేలకు చిక్కులు..గ్రాఫ్ డౌన్..!

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుయ బాగోలేదని స్వయంగా జగన్ చెప్పిన విషయం తెలిసిందే. పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని బరిలో దించుతామని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేల గురించే మాట్లాడారు గాని…ఆ పార్టీలో దాదాపు 50 మంది వరకు పనితీరు బాగోలేదని తెలిసింది.

దీంతో జగన్ ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా ఉంటారో అర్ధం కాకుండా ఉంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు..పార్టీ పదవుల్లో ఉన్నారు. అలాంటి వారి పరిస్తితి మరీ ఘోరంగా ఉందని తెలిసింది. ఎమ్మెల్యేలుగానే సరిగా పనిచేయలేకపోతున్నారని, ఇంకా పార్టీ పదవులని ఏం నిర్వహిస్తామని వారే టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొందరు స్వయంగా అధ్యక్ష పదవులని వదులుకుంటున్నారు. అయితే తాజాగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ..అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు.

అయితే ఎమ్మెల్యేగానే పూర్తిగా తిరగలేకపోతున్నామని,ఇంకా జిల్లా అధ్యక్షుడుగా సరిగా చేయలేమని చెప్పి..ధర్మశ్రీ…తనని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని జగన్‌కు విన్నవించుకోవడంతో ఆయనని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఈయనే కాదు..వైసీపీలో అధ్యక్షులుగా చేసే పలువురు ఎమ్మెల్యేల పరిస్తితి ఇలాగే ఉందట.  అయితే 13 మంది ఎమ్మెల్యేలు..జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట), అల్లూరి సీతారామరాజు-కె.భాగ్యలక్ష్మి (పాడేరు), అనకాపల్లి-కరణం ధర్మశ్రీ (మాడుగుల), కాకినాడ జిల్లా-కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌), కోనసీమ-పొన్నాడ సతీశ్‌కుమార్‌ (ముమ్మిడివరం), తూర్పుగోదావరి-జక్కంపూడి రాజా (రాజానగరం), పశ్చిమగోదావరి-చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట), ఏలూరు- ఆళ్ల నాని (ఏలూరు), కృష్ణా-పేర్ని నాని (మచిలీపట్నం), ఎన్‌టీఆర్‌-వెలంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ), పల్నాడు-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), నంద్యాల-కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), శ్రీసత్యసాయి-మాలగుండ్ల శంకరనారాయణ (పెనుకొండ), అన్నమయ్య జిల్లాకు గడికోట శ్రీకాంతరెడ్డి (రాయచోటి) అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

వీరిలో ధర్మశ్రీ తప్పుకున్నారు. అయితే ధర్మాన కృష్ణదాస్, పిన్నెల్లి, కాటసాని, శ్రీకాంత్ రెడ్డి మినహా మిగిలిన వారి గ్రాఫ్ డౌన్ లో ఉందని తెలిసింది. ఇటు ఎమ్మెల్యేగా, అటు అధ్యక్షుడుగా కూడా ఫెయిల్ అవుతున్నట్లు సమాచారం.