విలన్లగా మెప్పించిన హీరోలు వీళ్ళే!

కాలం మారింది. సినిమా చూసిన ప్రేక్షకుడి ధోరణి బాగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హీరోలను మాత్రమే ఆరాధించే జనాలు ఇపుడు విలన్లను కూడా అదేస్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇక రెమ్యునరేష్ విషయంలో కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా విలన్లు డిమాండ్ చేస్తున్నారు. కథను ముందుకు తీసుకెళ్లడంతో కథానాయకుడుది ప్రధాన పాత్ర అయితే, ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడడమే ప్రతినాయకుడి లక్షణం. సాధారణంగా హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే ఈమధ్య కాలంలో నాయకులు, ప్రతినాయకులుగా మన హీరోలే కొన్ని కొన్ని సినిమాలలో నటించేస్తూ రెండు చేతులనిండా సంపాదిస్తూ ప్రేక్షకులను మైమరిపించేస్తున్నారు.

ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది మన లోకనాయకుడు కమల్ హాసన్ గురించి. రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్‌హాసన్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న కమల్‌హాసన్‌. తరువాత మణిరత్నం, హెచ్‌. వినోద్‌ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్‌.

అవును, ప్రభాస్, దీపికా పదుకోన్‌ జంటగా అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘ప్రాజెక్ట్‌ కె’లో నటించడానికి కమల్‌హాసన్‌ ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో కమల్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్‌హాసన్‌కు కొత్తేమీ కాదు. ‘ఇండియన్‌’, ‘ఆళవందాన్‌’ (తెలుగులో ‘అభయ్‌’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా చెప్పుకుంటే పోతే మనదగ్గర కూడా ‘జై లవకుశ’ చిత్రం ద్వారా ప్రతి నాయకుడి పాత్రలో ఎన్టీఆర్‌ ఇరగదీసాడు.