తణుకుపై జనసేన పట్టు..టీడీపీ వదులుకునే ఛాన్స్ లేదు.!

తణుకు నియోజకవర్గం టి‌డి‌పికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1983 టూ 1999 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచింది. 2004, 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. 2019 లో మళ్ళీ ఓడిపోయింది. 2019లో చాలా స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడింది. వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేయగా, టి‌డి‌పి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి గెలిచారు.

ఈయన 2009లో కూడా కాంగ్రెస్ నుంచి 1400 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు అదే లక్ గా గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యే అయిన కారుమూరికి మధ్యలో మంత్రి పదవి దక్కింది. అటు ఎమ్మెల్యేగా, ఇటు మంత్రిగా కారుమూరి రాణించడం లేదు. ఆయనపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లికి పాజిటివ్ ఉంది. గతంలో టి‌డి‌పి హయాంలో తణుకులో అభివృధ్ది చేశారు. దీంతో ప్రజలు మళ్ళీ అరిమిల్లి వైపు చూస్తున్నారు.

ఇదే సమయంలో ఈ సీటుపై జనసేన కన్నేసింది. తాజాగా పవన్ వారాహి యాత్ర తణుకులోనే జరిగింది. దీంతో ఈ సీటు తమదే అంటున్నారు. అయితే పొత్తులు లేకుండా ఉంటే సీటుపై ఇబ్బందు ఉండదు. టి‌డి‌పి-జనసేన మధ్య పొత్తు ఉంటే సీటు విషయంలో ఇబ్బందే. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 32 వేల ఓట్ల వరకు పడ్డాయి. అటు టి‌డి‌పికి 74 వేల వరకు వచ్చాయి. కాబట్టి ఈ సీటు టి‌డి‌పి వదులుకునే అవకాశాలు లేవు. అలాగే జనసేన కూడా ఈ సీటు కోసం పట్టు పట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో.