ఎన్డీయేలో మీటింగ్‌కి పవన్..బాబు కోసమేనా?

మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బి‌జే‌పి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి.

ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు బెంగళూరులో సమావేశం అవుతున్నాయి. ఇటు బి‌జే‌పి సైతం తమ ఎన్డీయే మిత్రపక్షలకు ఆహ్వానం పలికింది. దాదాపు 30 పార్టీలకు ఆహ్వానం ఇచ్చింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేనకు ఎన్డీయే మీటింగ్ కు ఆహ్వానించింది. అటు యూపీఏ పక్షం సైతం…తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని ఆహ్వానించలేదు.

ఇక ఎన్డీయే మీటింగ్‌కు పవన్ హాజరు అవుతున్నారు. తొలిసారి ఆయన ఎన్డీయే మీటింగ్‌కు వెళుతున్నారు. దీంతో సమావేశంలో ఏం జరగనుంది..దీని తర్వాత పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే టి‌డి‌పిని ఎన్డీయే మీటింగ్‌కు ఆహ్వానించలేదు. ఎందుకంటే టి‌డి‌పి..పొత్తులో లేదు. అయితే టి‌డి‌పితో కలిసి ముందుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బి‌జే‌పిని సైతం ఒప్పించి..టి‌డి‌పితో కలిసేలా పవన్ చేస్తారా? అనేది చూడాలి.

లేదా బి‌జే‌పి ఒప్పుకోకపోతే ఆ పార్టీని వదిలేసి..టి‌డి‌పితో కలుస్తారా? లేదా టి‌డి‌పిని సైడ్ చేసి..బి‌జే‌పితోనే కలిసి ముందుకెళ్తారా? అనేది చూడాలి. అయితే బి‌జే‌పితో కలిసి ముందుకెళితే పవన్‌కు పావలా ఉపయోగం ఉండదు. టి‌డి‌పితో కలిస్తేనే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. చూడాలి మరి పవన్ పొత్తుల విషయంలో ఎలా ముందుకెళ్తారో.