పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు కౌంటర్లు ఇచ్చారు. ప్రతి సమస్యపై మాట్లాడుతూనే..వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ఒకే కులానికి చెందిన వారికి 142 పోస్టులు కట్టబెట్టింది కాక క్లాస్‌ వార్‌ గురించి మాట్లాడతారా అని సీఎం జగన్ పై పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ‘మద్యపానం నిషేధిస్తామన్నారు.. జరగలేదు. గంగవరం నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఇసుక ర్యాంపులను ఒక కంపెనీకే కట్టబెట్టారు. అలాంటి మీరా క్లాస్‌ వార్‌ గురించి మాట్లాడేది.. సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గొడ్డలిని రాష్ట్ర గుర్తుగా మార్చారని ఎద్దేవాచేశారు. చిన్నప్పుడే జగన్‌ పోలీసులను కొట్టాడని, ఎస్‌ఐ ప్రకాశ్‌బాబును ఎలా కొట్టారో అందరికీ తెలుసని అన్నారు. జగన్ ప్రతిసారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడని, జగన్ గురించి తనకు  అంతా తెలుసని, హైదరాబాద్‌లో ఏం చేశాడో, ఏమేమీ ఒరగబెట్టాడో లోతైన విషయాలు తెలుసని అన్నారు.

ఇక సంపూర్ణ మద్య నిషేధం అంత తేలికైనది కానే కాదని, జనసేనకు అధికారం ఇస్తే ఒకప్పటి పాత ధరలకే అమ్ముతామని,  అందులో కొంత శాతం గీత కార్మికుల సంక్షేమానికి ఇస్తామని, ఆడబిడ్డలు తమ ప్రాంతంలో మద్యం అమ్మకాలకు వీల్లేదంటే అక్కడ మాత్రం సంపూర్ణ మద్య నిషేదం అమలు చేస్తామని అన్నారు.